కలం, ఖమ్మం బ్యూరో: వన్యప్రాణులను వేటాడి (Wildlife Crime) వాటి అవయవాలను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను బూర్గంపహాడ్ పోలీసులు(Burgampadu Police), టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఎండిన చిరుతపులి చర్మం, 17 గోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు బూర్గంపహాడ్ ఎస్‌ఐ ఈ. నాగబిక్షం ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం తాళ్లగొమ్మూరు గ్రామంలో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన చల్లా అనిల్‌కుమార్ ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా ఎండబెట్టిన చిరుతపులి చర్మంతో పాటు 17 గోళ్లు బయటపడ్డాయి.
పోలీసుల విచారణలో నిందితులు గత వేసవిలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని చింతూరు మండలం గమ్మలకోట అటవీ ప్రాంతంలో చిరుతపులిని హతమార్చినట్లు వెల్లడైంది. గుంతలో పడిన చిరుత బయటకు రాలేకపోవడంతో రాళ్లు, కర్రలతో దాడి చేసి, బాణాలు విసిరి చంపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం దాని చర్మాన్ని వలిచి ఎండబెట్టి, గోళ్లను భద్రపరిచినట్లు వెల్లడించారు. వన్యప్రాణి అవయవాలను విక్రయించి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొనుగోలుదారుల కోసం తాళ్లగొమ్మూరుకు చెందిన చల్లా అనిల్‌కుమార్‌ను సంప్రదించారు.
అతడి సహకారంతో కుంజ భద్రయ్య, కుంజా గంగరాజు, మడవి కన్నయ్యలు చిరుత చర్మం, గోళ్లను బ్యాగులో పెట్టుకుని తాళ్లగొమ్మూరుకు తీసుకొచ్చారు. విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులు చల్లా అనిల్‌కుమార్, కుంజ భద్రయ్య, కుంజా గంగరాజు, మడవి కన్నయ్యలను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

