20 స్కాంలపై విచారణ చేయండి.. సీఎంకు బీఆర్ఎస్ఎల్పీ లేఖ

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ హయాంలో జరిగిన 20 స్కాంలపై విచారణ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ఎల్పీ (BRSLP) లేఖ రాసింది. రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి, కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని లేదా హౌస్ కమిటీ వేయాలని లేఖలో ప్రస్తావించింది. సివిల్ సప్లై, అమృత్ టెండర్లు, KLSR, నైనీ కోల్ బ్లాక్-సింగరేణి, సిగరేణి ఓబీ, సోలార్ పవర్, NTPC థర్మల్ పవర్, హెచ్‌సీయూ భూములు, లగచర్ల భూముల వ్యవహారం, కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితా, ఎక్సైజ్ మైక్రో బ్రూవరీ, హమ్ రోడ్స్, ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌) బాండ్లు, యంగ్ ఇండియా స్కూల్స్, ఫోర్త్ సిటీ, హిల్ టీపీ, అక్రమ మైనింగ్, డెక్కన్ సిమెంట్స్, మంచి రేవుల దేవాదాయ భూముల వ్యవహారాలపై విచారణ జరిపించాలని కోరింది.

“మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రం అవినీతి కుంభకోణాల కేంద్రంగా మారిపోయిన దుస్థితి నెలకొంది. లెక్కకు మించిన కుంభకోణాలు వరుసగా బయటపడుతుండటం మాత్రమే కాకుండా, స్వయంగా మంత్రులు, ప్రజా ప్రతినిధుల ప్రమేయంతో ఈ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. రెండున్నరేళ్ల పాలనా వ్యవధిలో ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని పూర్తిగా ఛిద్రమయ్యేలా చేసిన ఘనత మీ ప్రభుత్వానికే దక్కుతుంది. దాదాపు అన్ని శాఖలలో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం యదేచ్చగా సాగుతుండగా, వాటిని అడ్డుకునే బాధ్యత వహించాల్సినవారే ఈ దోపిడీకి మూలస్తంభాలుగా మారిన పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. బాధ్యత వహించాల్సిన మంత్రులే కుంభకోణాల్లో నేరుగా ప్రమేయం ఉన్నారనే ఆరోపణలు రావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ మాత్రమే కాదు, అవమానం కూడా..

ఈ కుంభకోణాల ఫలితంగా వేల కోట్ల రూపాయల ప్రజా ధనం కొద్దిమంది చేతుల్లోకి మళ్లిపోతుండగా, సామాన్య ప్రజలకు అందాల్సిన సంక్షేమం, అభివృద్ధి పూర్తిగా దెబ్బతింటోంది. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన పారదర్శకత, బాధ్యతాయుత పాలన అనే హామీలు నీటి మూటలుగా మారిపోయాయి. మాటల్లో నీతి వాక్యాలు..చేతల్లో దోపిడీ.. ఇదే మీ పాలనకు ప్రతీకగా మారింది. అవినీతిని అరికట్టడంలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విషయం కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం అయ్యింది. ఈ పాలనలో నియంత్రణ లేకుండా సాగుతున్న ఈ దోపిడీని చూస్తే, ఇది నిర్లక్ష్యమా లేక మీ ప్రోత్సాహమా అన్న అనుమానం ప్రజల్లో మరింత బలపడుతోంది. అవినీతి, కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జరుపుతాం అని శాసన సభలో స్వయంగా మీరే ప్రకటించారు. కాబట్టి మీ పాలనలో జరిగిన కుంభకోణాల వివరాలు అందిస్తున్నాం. మీ మాటపై మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ కుంభకోణాలపై వెంటనే సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించి ఇందులో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజా ధనాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం” అని పేర్కొంది.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>