బీఆర్ఎస్ కు డ్యామేజ్.. బెడిసికొట్టిన చెవిలో పువ్వు..!

కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌(Budget)ను నిరసిస్తూ అసెంబ్లీలో బీఆర్ఎస్ శ్రేణులు (BRS Protest) చేసిన హంగామాపై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదని, ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవని బీఆర్‌‌ఎస్ నేతలు ఆరోపించారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించడాన్ని విస్మరించిందని అసెంబ్లీలోనే బడ్జెట్ ప్రతులను చింపేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మండిపడుతూ చెవుల్లో పూలు పెట్టుకుని నిరసనకు దిగారు. ఈ నిరసనే బీఆర్ఎస్‌కు నెగెటివ్‌గా మారింది. అతి చేసి అభాసుపాలయ్యాం అనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే వినిపిస్తున్నది. ఇటు కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ సైతం బీఆర్ఎస్ తీరును తప్పుపట్టాయి. బడ్జెట్ రోజునే ఇలా వ్యవహరిస్తే చర్చల్లో ఎలాంటి వివాదాలకు కారణమవుతారోననే చర్చలు మొదలయ్యాయి.

ఆరు గ్యారంటీలపై బీఆర్ఎస్ ‘అతి’ చేష్టలు :

ఆరు గ్యారంటీల అమలును రేవంత్ రెడ్డి సర్కార్ విస్మరించిందని హరీశ్‌రావు, కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు. రైతు భరోసా పేరుతో రూ. 15 వేలు ఇస్తామన్న హామీ, మహిళలకు ఇస్తామని చెప్పిన రూ. 2,500 మహాలక్ష్మి పథకం ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. బడ్జెట్ ద్వారా ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టారని ఆరోపించారు. ఈ నిరసనతో పొలిటికల్ మై‌‌లేజ్ పెరుగుతుందని బీఆర్ఎస్ నేతలు భావించినా ప్రజల్లో లేని డిమాండ్‌ను పట్టుకుని ఒంటరి అయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నిరసనకు జనాల్లోనూ ఆశించినంత ఆదరణ రాలేదని గులాబీ లీడర్లే అభిప్రాయపడుతున్నారు. ఆరు గ్యారంటీలపై ప్రజలెవ్వరూ రోడ్డు ఎక్కి నిరసనలు తెలపలేదని, బడ్జెట్‌పైనా అసంతృప్తి వ్యక్తం చేయలేదని, అయినా బీఆర్ఎస్ నిరసన తెలపడం పార్టీకి పొలిటికల్‌గా పాజిటివ్ కాలేదన్నది ఆ పార్టీ భావన.

సెంటిమెంట్ బలంగా ఉంటే ఓకే.. :

తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్‌కు ప్రజల్లో ఆదరణ ఉండేదని, వారి మద్దతు లభించేదని, ఎలాంటి పోరాట రూపాన్ని ఎంచుకున్నా సక్సెస్ అయ్యేదని ఆ పార్టీ నేత ఒకరు గుర్తుచేశారు. ఆ సెంటిమెంట్‌తోనే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రతులను చింపేసినా, బల్లల మీదకు ఎక్కి నిరసన చేసినా, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలినా నడిచిందని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, జనంలో ఆమోదం ఉండదని వ్యాఖ్యానించారు. రైతుభరోసా విషయంలోనూ ప్రభుత్వం ఆలస్యం చేసినా, మొత్తానికే ఎగ్గొట్టినా రైతులు రోడ్డెక్కడంలేదని ఉదహరించారు. నిజానికి రైతు భరోసాపై రైతుల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తే ఉంటే సర్పంచ్ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించేదన్నారు. ప్రజల ఆందోళనలున్నప్పుడు పార్టీ నాయకత్వం వహించడం వేరు.. పార్టీయే ఉద్దేశపూర్వకంగా కదిలించి రోడ్డెక్కించడం వేరు.. అని అన్నారు. చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలపడం పాజిటివ్ కంటే నెగెటివ్ ప్రభావమే వేసిందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>