కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదు : ఎమ్మెల్సీ రవీందర్ రావు

కలం, వరంగల్ బ్యూరో : రాష్ట్రంలో పండిన మొక్కజొన్న పంటలో ఇప్పటివరకు ఐదు శాతం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, రైతుల సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్ రావు (MLC Ravinder Rao) ఆరోపించారు. గురువారం హనుమకొండలోని బాలసముద్రం ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని, మద్దతు ధర కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేశామని, అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని విమర్శించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయ అధికారులు మొక్కజొన్న సాగును తక్కువగా అంచనా వేశారని ఆయన అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో అధికారులు 60 వేల ఎకరాల్లో మాత్రమే మొక్కజొన్న ఉందని చెప్పగా, వాస్తవానికి 1.5 లక్షల ఎకరాల్లో సాగు జరిగినట్లు తెలిపారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం మహబూబాబాద్ జిల్లాలో 18 కేంద్రాలకు అనుమతి ఇచ్చినా, కేవలం 12 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయని, అవి కూడా ప్రధానంగా కేసముద్రం మార్కెట్‌కే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రైవేట్ వ్యాపారులు 95 వేల క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేయగా, ప్రభుత్వం కేవలం 101 క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేసిందని తెలిపారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.1400 నుంచి రూ.1500 మాత్రమే చెల్లిస్తున్నారని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.2400 ఉండగా ప్రతి క్వింటాల్‌పై రైతులు దాదాపు రూ.1000 నష్టపోతున్నారని ఆయన (MLC Ravinder Rao) ఆవేదన వ్యక్తం చేశారు.

ములుగు జిల్లాలో 40 వేల ఎకరాల్లో సాగు ఉన్నప్పటికీ నాలుగు కేంద్రాలే ఏర్పాటు చేశారని, భూపాలపల్లి జిల్లాలో ఒక్క కేంద్రం కూడా పనిచేయడం లేదని విమర్శించారు. వరంగల్ జిల్లాలో ఆరు కేంద్రాలు ప్రారంభించినా ఒక్క కేంద్రంలో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయని చెప్పారు. ములుగు, జనగామ జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క క్వింటాల్ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ఆరోపించారు. రైతులు యూరియా అధికంగా వాడుతున్నారని మంత్రి వ్యాఖ్యానించడం సరైంది కాదని, మొక్కజొన్న పంటకు యూరియా వినియోగం అవసరమని చెప్పారు. కొనుగోలు ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక లేదని, గోదాములు, నిల్వ సదుపాయాలపై కూడా అధికారులు స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also: అందుకే 100 యంగ్ ఇండియా స్కూళ్లకు శ్రీకారం చుట్టాం: భట్టి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>