కలం, వెబ్ డెస్క్: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం (Middle East War )నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ తరుణంలో అమెరికా(US) కీలక ప్రకటన చేసింది. యుద్ధ సమయంలో రష్యా చమురును దిగుమతి చేసుకునేందుకు భారత్ (India)కు మినహాయింపు కల్పించింది. ఈ విషయాన్ని యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
ప్రపంచ ఇంధన మార్కెట్‌లో చమురు సరఫరా సాఫీగా సాగేలా చూసేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ రిఫైనరీలు రష్యా చమురు (Russian Oil) కొనుగోలు చేసేందుకు వీలుగా అమెరికా ట్రెజరీ విభాగం 30 రోజుల పాటు తాత్కాలిక మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఇంధన విధానాల వల్ల ప్రస్తుతం అమెరికాలో చమురు, గ్యాస్ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో ఇబ్బందులు కలగకుండా ఈ తాత్కాలిక వెసులుబాటు కల్పించారు.
ఈ మినహాయింపు కేవలం ఇప్పటికే సముద్ర ప్రయాణంలో ఉండి, మధ్యలో నిలిచిపోయిన చమురు రవాణాకు మాత్రమే వర్తిస్తుంది. ఇది స్వల్పకాలిక నిర్ణయం మాత్రమే కాబట్టి దీనివల్ల రష్యా ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక ప్రయోజనం ఉండదని అమెరికా భావిస్తోంది. భారతదేశాన్ని అమెరికా ఒక ముఖ్యమైన భాగస్వామిగా పరిగణిస్తోంది. ఈ తరుణంలో భారత్ తన అవసరాల కోసం అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను మరింత పెంచుకుంటుందని వాషింగ్టన్ ఆశిస్తోంది. ప్రపంచ ఇంధన వనరులను ఇరాన్ తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తోందని, ఆ ఒత్తిడిని తగ్గించడానికే ఈ తాత్కాలిక ఏర్పాటు చేసినట్లు అమెరికా స్పష్టం చేసింది.

