కలం, కరీంనగర్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై పలువురు బీఆర్ఎస్ నేతలు కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌పై సీఎం చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు.
చట్టం ముందు అందరూ సమానమే..
ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉండటంతో పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)-2023లోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయాలని కోరారు. చట్టం ముందు అందరూ సమానమే అన్న సూత్రానికి అనుగుణంగా ముఖ్యమంత్రికి మినహాయింపు లేకుండా నిష్పాక్షికంగా దర్యాప్తు చేపట్టాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు.

