కలం, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam) గోదావరిలో గల్లంతైన (Students missing in Godavari) వారిలో మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన ఐదుగురు యువకుల్లో శుక్రవారం ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. శనివారం సతీష్ కుమార్, తేజజ్ఞసాయి మృతదేహాలను అధికారులు వెలికితీశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఏపీలోని అమరావతి ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన పాశం సతీశ్‌కుమార్, కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన తేజజ్ఞసాయి, భద్రాచలం పట్టణానికి చెందిన చారుగుళ్ల శ్రీకర్(21), కృష్ణా జిల్లా కలిదిండి గ్రామానికి చెందిన చండూరి దీపక్, విజయనగరానికి చెందిన గడ్డం హర్షవర్దన్, కేఎల్‌యూలో బీటెక్ చదివే కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన దగ్గుపాటి నవదీప్(19), భద్రాచలం పట్టణానికి చెందిన పొడిచేటి అభిరామ్(19).. గురువారం భద్రాద్రి రామయ్య దర్శించుకున్నారు.
వీరు దేవస్థానం కాటేజీలో రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం ఫొటో షూట్ కోసం భద్రాచలం సమీపంలో ఉన్న కొల్లుగూడెం ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లారు. అక్కడ గోదావరిలో నీరు లేకపోవడంతో మూడు కిలోమటర్ల దూరం ఇసుకలో నడుచుకుంటూ నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి నీటి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే చండూరి దీపక్ మినహా మిగతా ఆరుగురు గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు దిగారు. వీరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నదిలో నడుస్తుండగా కొంచెం ముందుకెళ్లగా లోతు ఉన్న ప్రాంతంలో తొలుత తేజజ్ఞసాయి గల్లంతయ్యాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో శ్రీకర్, నవదీప్, అభిరామ్, పాశం సతీశ్‌కుమార్, గడ్డం హర్షవర్ధన్‌లు నదిలో గల్లంతయ్యారు. హర్షవర్ధన్‌కు ఈత రావడంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు.

