కలం డెస్క్ : కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణకు శాపంగా మారడంతో ఇక్కడ బీజేపీ ఎంపీలను టార్గెట్ చేసేలా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న మెట్రో రైల్ విస్తరణ మొదలు మూసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల కనెక్టివిటీ, యూరియా కొరత… ఇలాంటి అనేక అంశాలను కాంగ్రెస్ ఏకరువు పెడుతున్నది. అవకాశం కోసం కాచుకుని ఉన్న ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సరిగ్గా యూరియా అంశంలో కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర సర్కారు 42% రిజర్వేషన్ పై చట్టాన్ని పంపినా కేంద్రం నుంచి ఆమోదం రాకపోవడంతో కన్ ఫ్యూజన్ నెలకొన్నది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను నిలదీసేలా కార్యాచరణ సిద్ధమవుతున్నది.
బీజేపీని కార్నర్ చేసేలా… :
తెలంగాణలో అధికారం తమదేనని గొప్పగా చెప్పుకుంటున్న బీజేపీ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లోనూ తనదైన ప్రభావాన్ని చూపేలా ప్లాన్ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రంగా బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తున్నది. దీంతో ఏకకాలంలో బీజేపీ, బీఆర్ఎస్ లను ఎదుర్కోవడం కాంగ్రెస్ కు అనివార్యమైంది. ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, అనుమతులు, చట్టబద్ధతపై సైలెంట్ గా ఉన్నారని, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రానికి ఒరిగిన ప్రయోజనమేమీ లేదని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్ళడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. వేర్వేరు రూపాల్లో ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసేలా బీజేపీని డిఫెన్స్ లోకి నెట్టేయాలన్నది కాంగ్రెస్ వ్యూహం.
రిజర్వేషన్ వ్యతిరేకిగా బీజేపీ :
స్థానిక ఎన్నికల అంశం తెరమీదకు రావడంతో బీసీలకు 42% ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ హైలైట్ చేస్తూనే న్యాయస్థానాల ద్వారా చిక్కులు ఎదురైతే ఆ పాపాన్ని బీజేపీ మీదకు నెట్టేసేలా ఆలోచిస్తున్నది. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పెట్టినప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చిందని, ఇప్పుడు అది సాకారం కావాలంటే కేంద్రం ఆమోదం తప్పదని, రాజ్యాంగ సవరణ కోసం పట్టుబట్టాలని బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ ఒత్తిడి పెంచేలా ప్లాన్ చేస్తున్నది. ముస్లిం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని తెరమీదకు తెచ్చి మొత్తం బీసీలకే రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేసే బీజేపీ నిర్వాకాన్ని ప్రజల్లో వివరించాలనుకుంటున్నది. స్థానిక ఎన్నికలకు కోర్టు ద్వారా చిక్కులు వచ్చి పోలింగ్ ప్రక్రియకు విఘాతం కలిగితే ఆ పాపం బీజేపీదేనంటూ స్పష్టం చేయదల్చుకున్నది.
బీఆర్ఎస్ పై సైతం గుస్సా :
బీజేపీ ఎంపీల విషయంలో బీఆర్ఎస్ సైతం గుర్రుగానే ఉన్నది. ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా అని ఇప్పటికే కేటీఆర్ ఘాటుగా విమర్శిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా సకాలంలో అనుమతులు ఇవ్వకుండా బీజేపీ ఇబ్బంది పెట్టిందని, రాష్ట్రాల హక్కులను హరించిందని పలు సందర్భాల్లో కేసీఆర్, కేటీఆర్ విమర్శించారు. ఇప్పుడు కూడా బీజేపీ బలపడడాన్ని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్… పరిస్థితిని తిరిగి కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని ఆరాట పడుతున్నది. బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోతాయని, పైకి కుస్తీ అని చెప్పుకుంటున్నా లోపల దోస్తీ కొనసాగుతున్నదని కాంగ్రెస్ కామెంట్ చేసింది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడంపై గతంలో చర్చలు జరిగాయంటూ స్వయంగా కల్వకుంట్ల కవిత చెప్పిన అంశాన్ని హైలైట్ చేసి ఏకకాలంలో బీజేపీ, బీఆర్ఎస్ లను కాంగ్రెస్ కార్నర్ చేయాలనుకుంటున్నది.

