కలం డెస్క్ : కేసీఆర్ (KCR) హఠాత్తుగా బీఆర్ఎస్ ఎల్పీ , పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఈ నెల 19న ఎందుకు పెడుతున్నారు?.. స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) ప్రక్రియ ముగిసిన వెంటనే పెట్టడంలోని ఆంతర్యమేంటి?.. ఊహించిన స్థాయికంటే ఎక్కువ సీట్లు వచ్చినందువల్లేనా?.. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదనే అంశాన్ని ఎత్తుకోవడం వెనక వ్యూహమేంటి?.. ప్రజల్లో పార్టీ ఇప్పటికీ బలంగా ఉన్నదనే భావనతో కమిటీల ఏర్పాటుపై దృష్టి సారిస్తారా?.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత (Kavitha) చేస్తున్న కామెంట్లతో పార్టీలో ఏర్పడిన అసంతృప్తికి చెక్ పెట్టాలనుకుంటున్నారా?.. ఇలాంటి అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ చేసే ప్రసంగం, లేవనెత్తే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి.
నెల రోజుల ముందుగానే ఎందుకు?
పార్టీ నేతలు అందిస్తున్న సమాచారం ప్రకారం కేసీఆర్ సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ భవన్‌కు (Telangana Bhavan) వచ్చి సమావేశాన్ని నిర్వహించాల్సి ఉన్నది. దక్షిణాయనంలో మంచి రోజులు ఉండవు కాబట్టి సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయనంలో పార్టీ మీటింగ్ పెట్టాలనుకున్నారు. కానీ నెల రోజుల ముందుగానే పెట్టడం వెనక వ్యూహం నేతలకు అంతు చిక్కలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెల 17న ముగుస్తుండడంతో వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ (ZPTC, MPTC) ఎన్నికలు ఉండవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మంచి ఫలితాలు వచ్చినందున ఇదే ఉత్సాహంతో పార్టీ గుర్తుపై జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మరిన్ని స్థానాలు కైవశం చేసుకోవాలన్న ఉద్దేశంతో షెడ్యూలుకంటే నెల రోజుల ముందుగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
కవిత కామెంట్లతో డ్యామేజ్ కంట్రోల్ :
పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత గత నెల రోజులుగా వ్యక్తులను, పార్టీని ఉద్దేశిస్తూ చేస్తున్న కామెంట్లపై బీఆర్ఎస్ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. కేసీఆర్ కుమార్తె కావడంతో కౌంటర్ ఇవ్వడానికి కొందరు తటపటాయిస్తున్నారు. ఏదో ఒక రోజు సీఎం అవుతానని, అప్పుడు 2014 నుంచి జరిగిన అన్ని అంశాలపై దృష్టి సారిస్తానని ఇటీవల ఆమె వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఇది కేసీఆర్‌పై కూడా గురి పెట్టినట్లయింది. హరీశ్‌రావు(Harish Rao)పై విమర్శలతో మొదలుపెట్టిన ఆమె వ్యవహారశైలి చివరకు పలువురు ఎమ్మెల్యేలు, సొంత అన్న కేటీఆర్(KTR), పరోక్షంగా తండ్రి కేసీఆర్‌ను కూడా తప్పుపట్టేలా ఉన్నదనే అభిప్రాయం బీఆర్ఎస్ నేతల్లో నెలకొన్నది. తెలంగాణ భవన్‌లో ఈ నెల 19న జరిగే పార్టీ సమావేశంలో కేసీఆర్(KCR) తనంతట తానుగా కవిత ప్రస్తావన తెచ్చినా తేకపోయినా లీడర్లు ప్రస్తావించే అవకాశాలున్నాయి. వీటిపై కేసీఆర్ ఒక స్పష్టత ఇవ్వవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆరోగ్యంగానే ఉన్నాననే సంకేతం :
ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పలు రకాల మెసేజ్‌ను తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఇవ్వాలనుకుంటున్నారు. ఆరోగ్యంగానే ఉన్నానని, ఇకపైన పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్‌గా ఉంటానని చెప్పే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడి కుదుట పడడానికి రెండేండ్ల సమయాన్ని ఇవ్వనున్నట్లు గతంలోనే చెప్పారు. ఆ గడువు పూర్తికావడంతో ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఒక్కటొక్కటిగా లేవనెత్తనున్నారు. సాగునీటి ప్రాజెక్టులు (Irrigation Projects), కృష్ణా-గోదావరి జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఈ సమావేశంలో విస్తృతంగా మాట్లాడనున్నారు. పాలనా వైఫల్యాలను, హామీల అమలులోని లోపాలను, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని లేవనెత్తే అవకాశమున్నది. పార్టీ ఇకపైన ప్రజలతో కలిసి ఆందోళనను నిర్వహించనున్నట్లు కేడర్‌ను సన్నద్ధం చేసే మెసేజ్ ఇచ్చే అవకాశమున్నది. అదే సమయంలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, మెంబర్‌షిప్ డ్రైవ్ (Membership Drive) చేపట్టడం.. ఇలాంటి అంశాలపైనా క్లారిటీ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఒక్క సమావేశంతోనే పలు సందేహాలను నివృత్తి చేయనున్నారు.
Read Also: గోల్డ్.. డబుల్: రెండేండ్లలో రెట్టింపైన ధరలు
Follow Us On: X(Twitter)


