పోలీస్ శాఖలో మళ్లీ ఆర్డర్లీ వ్యవస్థ..!

కలం, వరంగల్ బ్యూరో: పోలీస్ శాఖలో (Telangana Police) మళ్లీ ఆర్డర్లీ వ్యవస్థ మొదలైంది. అధికారులు ఇండ్లల్లో కానిస్టేబుల్, హోం గార్డ్స్ వెట్టిచాకిరీ చేసే విధానానికి గత ప్రభుత్వం చరమ గీతం పాడింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పోలీస్ అధికారులు తిరిగి ఆర్డర్లీ వ్యవస్థకు షురూ చేశారు. అంతేగాకుండా ఆర్డర్లీ వ్యవస్థలో పని చేస్తున్న వారికి అదనంగా 30 శాతం అలవెన్స్ అందజేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో పోలీస్ శాఖకే పరిమితమైన ఈ వ్యవస్థ ప్రస్తుతం ఎమ్మెల్యేల వరకు విస్తరించినట్లు సమాచారం అందుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపుగా అందరి ఎమ్మెల్యే ఇండ్లల్లో ఇద్దరు నుంచి ముగ్గురు హోం గార్డ్స్ ఆర్డర్లీ విధానంలో విధులు నిర్వహిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పక్కా రాష్ట్రం కర్ణాటకలో ఆర్డర్లీ వ్యవస్థ ను రద్దు చేసింది. మరీ ఇక్కడ మాత్రం ఆ వ్యవస్థ ను పాటిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

బ్రిటిష్ కాలంలో షురూ..

దేశానికి స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్ (British) వాళ్లు తమ పాలనలో ఆర్డర్లీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా అదే విధానాన్ని అమలు చేస్తూ పోలీసు సిబ్బంది చేత పై స్థాయి అధికారులు వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. పోలీసు బాధ్యతలను నిర్వర్తించేందుకు, ప్రజలకు రక్షణ కల్పించేందుకు నియమితులైన సిబ్బంది… అధికారుల ఇళ్లల్లో ఇంటి పనులు, వంట పనులు, ఇతరత్రా పనులకు ఉపయోగించుకుంటున్నారు. ఇలా ఒక్క పని కాకుండా తమకు నచ్చిన విధంగా సిబ్బందితో పనులు చేయించుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఉదయం మొదలు సాయంత్రం వరకు పనులు చేస్తూ, అసలు ఉద్యోగం ఏంటనేది తెలియని స్థాయికి వెళ్లిపోతున్నారు. వంట పాత్రలు శుభ్రం చేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, వంట పనులు చేయడం, అధికారి ఇంటికి వచ్చిన వారికి టీ, కాఫీలు, టిఫినీలు అందించడం, భోజనం వడ్డించడం, పిల్లలను పాఠశాలకు లేదా కళాశాలకు తీసుకు వెళ్లడం, అధికారులు షాపింగ్ కు వెళ్తే వారి వెంట వెళ్లడం లాంటి పనులు చేస్తున్నారు.

పోలీస్ అధికారుల నుంచి ఎమ్మెల్యేల ఇంటికి…

మొన్నటి వరకు పోలీస్ శాఖకే పరిమితమైన ఆర్డర్లీ వ్యవస్థ ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల వద్దకు పాకింది. ఒక్కో ఎమ్మెల్యే, మంత్రి ఇంటి వద్ద ఇద్దరు నుంచి ముగ్గురు హోం గార్డ్స్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ పని చేస్తున్నందుకు గాను వీరికి అదనంగా 30 శాతం అలవెన్స్ అందజేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ట్రాఫిక్ విభాగంలో పని చేసే వారికి రిస్క్, పొల్యూషన్ అలవెన్స్ ల కింద అదనపు వేతనం అందజేస్తారు. అయితే గతంలో ఎమ్మెల్యే, మంత్రుల ఇళ్ళల్లో హోం గార్డ్స్ పని చేసిన దాఖలాలు లేవు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో విధానం అమలు చేస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. అయితే మాకు హోం గార్డ్స్ ను ఇవ్వండని ఎమ్మెల్యే లు కోరలేదని, సదరు ఎమ్మెల్యేలు నివాసం ఉంటున్న పరిధిలోని పోలీస్ (Telangana Police) అధికారులు కావాలనే హోం గార్డ్స్ ను వారి ఇళ్లల్లో డ్యూటీ లు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు, మంత్రులను మచ్చిక చేసుకోవడం కోసం నిబంధనలు ఉల్లంఘించడం ఎంతమేరకు సమంజసం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Read Also: మైనార్టీలకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు: మంత్రి కోమటిరెడ్డి

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>