కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకున్నది. మరికాసేపట్లో కొడుకు పెళ్లి జరగాల్సి ఉంటుంది. పెళ్లి వేడుక కోసం వస్తున్న పెళ్లి కొడుకు తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, బంధువులు పెళ్లి వేడుక కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాలుకు కారులో బయలు దేరారు. కొద్దిదూరం రాగానే కారు డివైడర్ కు ఢీకొని ఆక్సిడెంట్ అయ్యింది. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఇద్దరికీ గాయాలయ్యాయి.
డివైడర్‌ను ఢీకొట్టిన కారు
కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామ శివారులో పెళ్లి బృందం కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అందరూ రాజంపేట మండలం ఆరుగొండ గ్రామానికి చెందిన వాసులు. గాయపడ్డ వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి లోని రెండు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. దీంతో పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాలులో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

