కలం, వెబ్ డెస్క్: బ్రెజిల్‌కు (Brazilian Couple) చెందిన ఓ ప్రేమికుల జంట తమ ప్రేమను ప్రపంచ రికార్డుగా మార్చి సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం సందర్భంగా రెనాటో బైమా గియా (32), అతని ప్రియురాలు నైరా రోబెర్టా రిబీరో డి మారిన్స్ (33) అరుదైన రికార్డు కొల్లగొట్టారు. కేవలం 30 సెకన్ల వ్యవధిలో ఏకంగా 195 ముద్దులు పెట్టుకున్నారు. ఫలితంగా ‘అత్యంత వేగంగా ఎక్కువ ముద్దులు పెట్టుకున్న జంట’గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. వృత్తిరీత్యా వైద్యులైన వీరిద్దరూ కరోనా మహమ్మారి సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా సేవలు అందించారు. తాము ప్రపంచంలోనే అత్యుత్తమ జంట అని నమ్మామని, అందుకే ఈ సవాలును స్వీకరించామంటున్నారు.
ఈ రికార్డు ప్రయత్నంలో రెనాటో తన అభిమాన ఫుట్‌బాల్ టీమ్ జెర్సీని ధరించి, నైరా బుగ్గపై శరవేగంగా ముద్దులు కురిపించాడు. ఆమె నవ్వుతూ సహకరించింది. రెనాటోకు గిన్నిస్ రికార్డులు సాధించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వేగంగా 10 పుస్తకాలను అమర్చడం, ‘లార్జెస్ట్ ఫుట్ రొటేషన్’ (పాదాన్ని ఎక్కువ కోణంలో తిప్పడం) వంటి విభాగాల్లో ఇప్పటికే రికార్డులు సృష్టించారు. టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించిన రెనాటో తనకు ‘గెలవడం వ్యసనం” అని చెబుతున్నాడు. అత్యధిక ప్రపంచ రికార్డులు సాధించిన బ్రెజిలియన్‌గా నిలవడమే కాకుండా, ప్రియురాలి పేరు కూడా భాగం కావాలనే ఉద్దేశంతోనే తాజా ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు.

