కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఎమోషనల్ అయ్యారు. వైఎస్ఆర్ మరణంలో జగన్ హస్తం ఉందని తాను అనుమానించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఈ సమయంలో వైఎస్ఆర్ ను తలుచుకుని ప్రెస్ మీట్ లో బొత్స సత్యనారాయణ వెక్కి వెక్కి ఏడ్చారు. వైఎస్ఆర్ మరణంపై అచ్చెన్నాయుడు దిగజారి మాట్లాడారని ఆరోపించారు. ఆ సమయంలో తాను, తన భార్య కలిసి క్యాంప్ ఆఫీస్ నుంచి జగన్ ను తీసుకువచ్చామని తెలిపారు. వైఎస్ఆర్ మరణించిన రోజు జగన్ హైదరాబాద్ ఇంట్లోనే ఉన్నారని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జరిగిన సంతకాలతో జగన్ కు సంబంధం లేదని వెల్లడించారు. ఈ వాస్తవం అప్పట్లో తమ వెంట ఉన్న రఘువీరారెడి, కన్నా లక్ష్మి నారాయణ వంటి నేతలకు తెలుసునని చెప్పారు.
కూటమి నేతల డైవర్షన్ పాలిటిక్స్ షురూ..
అచ్చెన్నాయుడు (Atchannaidu) కేవలం తన పదవిని కాపాడుకోవడానికే పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) విమర్శలు గుప్పించారు. అమరావతి (Amaravati) అంశంపై తమని విమర్శించాలనుకుంటే .. రాజకీయంగా మాట్లాడాలి, కానీ ఇంత నీచంగా వ్యక్తిగత విమర్శలకు దిగవద్దని అచ్చెన్నాయుడుకు సూచించారు. రాజకీయంగా జగన్ ను ఎదుర్కోవాలి తప్ప చనిపోయిన వ్యక్తిని వివాదాల్లోకి లాగడం సంస్కారం అనిపించుకోదని ఎమోషనల్ అయ్యారు. తమ అధినేత జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ కు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుండడంతో కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అందుకే మంత్రులు ఇష్టారాజ్యంగా , అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతి స్కామ్ లో చంద్రబాబు అవినీతిపై జగన్ ప్రశ్నిస్తున్నారని.. కూటమి ప్రభుత్వం జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతుందని తెలిపారు. అందుకే ఇలాంటి నీచ రాజకీయాలకు కూటమి నేతలు తెరలేపుతున్నారని ఫైర్ అయ్యారు.
Read Also: జగన్ ఓ ‘మావిగన్ జోకర్’.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Facebook

