కలం, వెబ్ డెస్క్ : కేరళం నుంచి హైదరాబాద్కు వస్తున్న ఇండిగో విమానానికి (IndiGo Flight) బాంబు బెదిరింపు (Bomb Threat) రావడంతో కలకలం రేగింది. విమానంలో బాంబు ఉన్నట్లు గుర్తుతెలియని వ్యక్తి రాసిన సందేశం కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది, పైలట్ విమానాన్ని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Shamshabad Airport) మళ్లించారు.
వివరాల్లోకి వెళ్తే.. కేరళం నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఇండిగో విమానం 6E-244లోని బాత్రూంలో ఓ కాగితంపై బాంబు ఉందంటూ రాసి అతికించినట్లు ప్రయాణికులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని అంచనా వేసిన పైలట్ భద్రతా చర్యల్లో భాగంగా విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా (Emergency Landing) దించారు.
సమాచారం అందుకున్న సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది అప్రమత్తమై విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించి విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బెదిరింపు సందేశాన్ని ఎవరు ఉంచారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

