కలం, వెబ్ డెస్క్: ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట (Seethampeta) ఏజెన్సీ ఘాట్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. వాహనంలో ఉన్న 40 మంది ప్రయాణికులలో 17 మందికి గాయాలు అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సీతంపేట మండలం బెనరాయ్ గ్రామానికి చెందిన సుమారు 40 మంది పెళ్లి వేడుకకు బొలెరో వాహనంలో బయల్దేరారు. పుట్టిగాం గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు వీరు హాజరై భోజనాలు చేసి పెళ్లి అయ్యాక తిరుగు ప్రయాణమయ్యారు. వివాహ కార్యక్రమం ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా సవరపాడు ఘాట్ రోడ్డు వద్దకు వచ్చేసరికి వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను సీతంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నీలమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వైద్యులు ఆమెకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

