కలం, నిర్మల్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీతో పాటు మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను తక్షణమే ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) జిల్లా శాఖ డిమాండ్ చేసింది. రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి 51 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే డీఏ బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, కేజీబీవీ, సమగ్ర శిక్ష, మోడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, 317 జీవో బాధితులకు న్యాయం చేయడంతో పాటు టెట్-2010కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శశిరాజ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.

