కలం, వెబ్ డెస్క్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) మృతిపై ఏపీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం ప్రజా జీవితానికి, రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు అని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ నివాళులు అర్పించారు.
సీఎం చంద్రబాబు ముద్రగడ మరణవార్త విచారకరమని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రి నారా లోకేశ్ కూడా ముద్రగడ పద్మనాభం మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనకు నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముద్రగడను కాపు ఉద్యమానికి అంకితమైన నాయకుడిగా అభివర్ణించారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కాకినాడ నుంచి లోక్సభ సభ్యుడిగా ప్రజాసేవ చేశారని గుర్తు చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముద్రగడ మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఆయనను పార్టీ సీనియర్ నాయకుడిగా, పితృ సమానుడిగా అభివర్ణించారు. ముద్రగడ ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా ప్రజలకు సేవలందించారని కొనియాడారు. కాపు సామాజికవర్గం కోసం అలుపెరగని పోరాటం చేసిన నాయకుడిగా ఆయనను గుర్తు చేసుకున్నారు. ముద్రగడ మరణం కుటుంబానికే కాకుండా వైసీపీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు అని పేర్కొన్నారు.

