ముద్రగడ మృతిపై తెలంగాణ నేతల సంతాపం

కలం, వెబ్ డెస్క్: కాపు ఉద్యమ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఆయన సేవలను కొనియాడుతూ ప్రకటనలు విడుదల చేశారు.

ముద్రగడ ప్రజా నాయకుడు: సీఎం రేవంత్ రెడ్డి

మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఆకస్మిక మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, లోక్‌సభ సభ్యుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాడారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.

కాపు హక్కుల కోసం రాజీలేని పోరాటం: కేసీఆర్

రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపులకు, అనుబంధ కులాలకు అందించాలనే తపనతో ముద్రగడ పద్మనాభం రాజీలేని పోరాటం చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

నిబద్ధతతో సేవలు అందించారు: మంత్రి పొంగులేటి

మాజీ మంత్రి, మాజీ ఎంపీ, కాపు ఉద్యమ ప్రముఖ నేతగా ప్రజలకు సేవలందించిన ముద్రగడ పద్మనాభం మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రజా జీవితంలో నిబద్ధతతో సేవలందించిన వ్యక్తిగా నిలిచిపోతారని.. కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం కృషి చేసిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. ఆయన రాజకీయ ప్రయాణం అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతుందన్నారు.

రాజకీయాల్లో తీరని లోటు: హరీశ్ రావు

ప్రజా జీవితంలో ముద్రగడ పద్మనాభం తనదైన ముద్ర వేసినట్లు హరీశ్ రావు పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలకు సేవలందించిన ఆయన రాజకీయ ప్రస్థానం చిరస్మరణీయమైందని కొనియాడారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు తీరని లోటని, కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఆయనది ఆత్మగౌరవ పోరాటం: బండి సంజయ్

నమ్మిన ఆశయం కోసం తనదైన శైలిలో సామాజిక ఆత్మగౌరవ పోరాట మార్గాన్ని ఎంచుకొని రాజకీయ చైతన్య మార్గాన్ని సృష్టించి, ఆచరించి, అమలుపరచిన గొప్ప యోధుడు ముద్రగడ పద్మనాభం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నిత్యం ప్రజల మార్గాన్ని అనుసరిస్తూ, దశాబ్దాలుగా ప్రజా జీవితాన్ని కొనసాగించిన ఆదర్శనీయుడు అన్నారు. వారి పోరాట స్ఫూర్తి నిత్యం స్ఫూర్తిదాయకమని.. మరణం తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>