కలం, వనపర్తి: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో శుక్రవారం వనపర్తి (Wanaparthy) పట్టణంలోని రాజీవ్ చౌక్ ఎస్బీఐ సమీపంలో ధర్నా నిర్వహించారు. జిల్లా యువమోర్చా అధ్యక్షుడు అరవింద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొన్ని విద్యాసంస్థల్లో ఫీజులు చెల్లించలేక సర్టిఫికెట్లు పొందలేకపోతున్నారని తెలిపారు. దీంతో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలకు ఆటంకం కలుగుతోందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యార్థులను అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. ‘క్రిమినల్ పనులు చేసే రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాడు.. అందుకే విద్యార్థులను క్రిమినల్స్ అంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించి వారి భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు. తాను వనపర్తిలోనే జన్మించి విద్యాభ్యాసం కొనసాగించానని, విద్యార్థుల సమస్యలు తనకు తెలుసన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే ప్రజల్లో ఆ పార్టీపై వ్యతిరేకత ఏర్పడిందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, విద్యార్థులకు సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అందే బాబయ్య, సబిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, మంటంపల్లి పురుషోత్తంరెడ్డి, రామన్నగారి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్‌గౌడ్, కల్పన, బండారు కుమారస్వామి, శివారెడ్డి, కృష్ణగౌడ్, మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేష్, కౌన్సిలర్ విజయ్, నక్క మహేష్, కదిరి మధు, కొమ్ము శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

