కలం, కరీంనగర్: దేశవ్యాప్తంగా జరుగుతున్న బీజేపీ ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మానకొండూరు (Manakondur) మండల కేంద్రంలోని పద్మావతి ఫంక్షన్ హాల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని (Blood Donation Camp) నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం మండలాల యువమోర్చా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం మాట్లాడుతూ.. అన్ని దానాలలోకెల్లా రక్తదానం అత్యంత గొప్పదని, ఆపదలో ఉన్న వారికి ఇది ప్రాణదానంతో సమానమన్నారు.
యువత సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, సమాజానికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల రాజకీయ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ప్రస్థానం పూర్తిగా దేశ హితం కోసమే సాగిందని కొనియాడారు. మోదీ నాయకత్వంలో భారత్ ‘విశ్వగురువు’గా అవతరించిందని, ‘వికసిత భారత్’ లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సంగ నరేష్, రాష్ట్ర నాయకుడు ఇనుకొండ నాగేశ్వర రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకట్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అలువేలు స్వామి రెడ్డి, తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు చింతం శ్రీనివాస్, మానకొండూరు మండల అధ్యక్షుడు కందిరాజి రెడ్డి, శంకరపట్నం మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్, మానకొండూరు నియోజకవర్గ బీజేవైఎం కన్వీనర్ గడ్డం అరుణ్, చుక్కల శ్రీకాంత్ యాదవ్, మహిళా నాయకురాలు గాజుల స్వప్నలతోపాటు బీజేపీ, బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

