Mobile Popup Ad
Mobile Popup Ad

పెట్రోలు ధరలపై బీజేపీ స్టేట్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు

కలం, ఖమ్మం బ్యూరో: అంతర్జాతీయంగా చమురు సంక్షోభం వెంటాడుతున్నా దేశంలో ఇంధన ధరలను అదుపులో ఉంచిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్‌దేనని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు (Ramachandra Rao) పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వంతులవారీగా కొల్లగొడుతున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ఒక్కటేనంటూ పేర్కొన్నారు. కాళేశ్వరం విచారణ పేరుతో డ్రామాలు చేస్తున్నారని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఫైర్ అయ్యారు. ఖమ్మంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరావు అధ్యక్షతన జరిగిన శిక్షణా తరగతుల కార్యక్రమం అనంతరం రామచంద్రరావు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

నిధులపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం

కేంద్రం తెలంగాణకు రూ.10 లక్షల కోట్ల నిధులిచ్చినా కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని, రైతాంగ సంక్షోభాన్ని పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ, భారత్‌లో మాత్రం కేవలం రూ.3 మేరకే పెంపు జరిగిందని గుర్తుచేశారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుచూపునకు, వ్యూహాత్మక ఇంధన భద్రతకు నిదర్శనమని కొనియాడారు. అయితే దేశంలో స్వల్పంగా ధరలు పెరగడాన్ని సాకుగా చూపుతూ కాంగ్రెస్, ఇండీ కూటమి, బీఆర్ఎస్ పార్టీలు బాధ్యతారహితంగా రాజకీయ లాభాల కోసం ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని మండిపారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం

గత పదేళ్లలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటే, ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆ లోటును భర్తీ చేస్తూ ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా కొల్లగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందాలకు కాళేశ్వరం తూతూమంత్రపు విచారణే నిదర్శనమని కుండబద్దలు కొట్టారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్న కాంగ్రెస్ పాలకులకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారన్నారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు సుమారు రూ.10 వేల కోట్లకు పైగా పేరుకుపోయాయని, పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

కొనుగోలు కేంద్రాలు ఎందుకు తెరవరు?

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని వ్యవసాయ రంగం, కొనుగోలు కేంద్రాలు సకాలంలో తెరవకపోవడం వల్ల వరి, మొక్కజొన్న పండించిన అన్నదాతలు ఐకేపీ కేంద్రాల వద్ద వారాల తరబడి కన్నీరు పెడుతూ పడిగాపులు కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పూర్తి స్థాయిలో రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసి, ప్రతి గింజనూ మద్దతు ధరతో సేకరించాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతులను ఏకం చేసి రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం, మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన అంతా కేంద్ర నిధులతోనే జరుగుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ నిధులను తమ సొంత ఖాతాలో వేసుకుంటూ కేంద్రం ఏమీ ఇవ్వలేదంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ప్రబరి మహిపాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>