కలం, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిపిన కీలక చర్చల వివరాలను ఎక్స్ వేదికగా వెల్లడించారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి సంబంధించిన అవగాహన ఒప్పందం, ఇరాన్ అణు కార్యక్రమంపై జరగబోయే తుది చర్చల గురించి ట్రంప్‌తో సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన తెలిపారు. ఇరాన్ ముప్పును తిప్పికొట్టేందుకు ఆపరేషన్ రోరింగ్ లయన్, ఎపిక్ ఫ్యూరీ సమయాల్లో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు కలిపి పోరాడాయని ఆయన గుర్తు చేశారు. ఇజ్రాయెల్ భద్రత పట్ల అధ్యక్షుడు ట్రంప్ చూపిస్తున్న నిబద్ధతకు నెతన్యాహు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇరాన్‌తో కుదిరే ఎలాంటి తుది ఒప్పందమైనా ఆ దేశం నుండి ఎదురయ్యే అణు ప్రమాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేలా ఉండాలని తామిద్దరం ఏకీభవించినట్లు నెతన్యాహు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇరాన్‌లోని అణు కేంద్రాలను పూర్తిగా మూసివేయాలని, అక్కడ నిల్వ ఉన్న అణు పదార్థాలను ఆ దేశ భూభాగం నుండి తరలించాల్సి ఉంటుందని ట్రంప్‌తో చర్చించినట్లు పేర్కొన్నారు. లెబనాన్‌తో సహా అన్ని వైపుల నుండి ఎదురయ్యే ముప్పుల నుండి తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని ట్రంప్ పునరుద్ఘాటించారని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న బంధం యుద్ధ భూమిలో నిరూపితమైందని, ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సాధించలేదనే విషయంలో తనతో పాటు ట్రంప్ విధానంలో ఎలాంటి మార్పు లేదని నెతన్యాహు తేల్చి చెప్పారు.

