కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను (Fee reimbursement Dues) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమంలో భాగంగా సోమవారం హైదరాబాదులో బీజేపీ తలపెట్టిన చలో అసెంబ్లీ ముట్టడి (BJP Protest) కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడి కోసం కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేష్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు తరలి వెళ్లగా.. పోలీసులు అడ్డుకుని ముందస్తు అరెస్టులు చేపట్టారు.
జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశంతో పాటు మాజీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుగొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడవెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాసరావు, కరివేద మహిపాల్ రెడ్డి, పుప్పాల రఘు, బల్బీర్ సింగ్, అడిచెర్ల రాజు, యువర్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నేరెడ్ల ప్రవీణ్ రెడ్డి, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు సంఘ నరేష్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆకుల రాజేందర్, మండల అధ్యక్షులు రాజిరెడ్డి, అనిల్, చింతం శ్రీనివాస్, హరీష్, దళిత మూర్ఛ నాయకులు అనిల్లతో పాటు పలువురు ముఖ్య నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ప్రభుత్వ నిరంకుశత్వానికి ఈ అరెస్టులే నిదర్శనం..
బీజేపీ నేతల అక్రమ అరెస్టులపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, మాజీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి అణచివేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సుమారు రూ. 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడం వల్ల లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు, విద్యాసంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు ప్రభుత్వానికి బకాయలు చెల్లించే ఉద్దేశం ఉందా లేదా? అని మల్లేశం, కృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తుందని విమర్శించారు. విద్యార్థుల బకాయిలన్నీ పూర్తిగా చెల్లించే వరకు తాము వెనకడుగు వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుంటే.. తమ లడాయి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
గుర్రం వెంకటేష్ గౌడ్ అరెస్ట్..
ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళుతున్న కరీంనగర్ అసెంబ్లీ కో కన్వీనర్ గుర్రం వెంకటేష్ గౌడ్లను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రశ్నించే గొంతుకులను అణిచివేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. విద్యార్థులకు న్యాయంగా ఇవ్వాల్సిన ఫీజు బకాయిలు చెల్లించకుండా, కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. శాంతియుత పద్ధతిలో నిరసన తెలియజేసేందుకు బీజేపీ ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపడితే పోలీసులు అక్రమంగా అరెస్టు అరెస్టు చేయించడం ప్రభుత్వానికి తగదన్నారు.

