కలం, మెదక్ బ్యూరో: మహిళా బిల్లుపై (Women Reservation Bill) కాంగ్రెస్ పార్టీ నైజం ఏంటో బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (Payal Shankar) విమర్శించారు. కాంగ్రెస్ నేతలు బయటమాట్లాడే మాటలకు, పార్లమెంటులో వారి చర్యలకు పొంతన లేకుండా పోయిందన్నారు. మహిళా బిల్లు వీగిపోతే కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా బిల్లు వీగిపోయినందుకు కాంగ్రెస్ పార్టీ దేశంలోని మహిళలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి సంబురాలు చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి మహిళలంటే గౌరవం లేదు
కాంగ్రెస్ పార్టీకి మహిళలంటే గౌరవం లేదని విమర్శించారు. గాంధీ కుటుంబంలోని సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీకి మాత్రం పదవులు దక్కితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. దేశంలోని పేద మహిళలకు పదవులు దక్కొద్దా? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన వింత ప్రతిపాదనలను చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరుగుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులను చీపుర్లతో కొట్టేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని పాయల్ శంకర్ (Payal Shankar) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Read Also: సంచలనం.. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ఇదే ?
Follow Us On : WhatsApp

