తెలంగాణ ప్రభుత్వం హిల్ట్ పాలసీ(HILT Policy) పేరుతో భారీ కుంభకోణానికి తెరలేపిందని గవర్నర్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. సోమవారం బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్‌రావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం ఈ మేరకు గవర్నర్‌కు కంప్లయింట్ ఇచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్’ (హిల్ట్) పాలసీ పేరుతో ఇప్పటికే అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మాట్లాడుతూ.. హిల్ట్ పాలసీ అమలు వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని, వేల కోట్ల రూపాయల భూకుంభకోణం జరుగుతున్న అవకాశముందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఉన్న భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చడం ద్వారా ప్రైవేట్ ఆకాంక్షలకు తావిస్తోందని, ఇందులో పారదర్శకత లేకుండా నిర్ణయాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ(HILT Policy) వెనుక పారిశ్రామిక రంగ అభివృద్ధి కన్నా ఇతర ప్రయోజనలు ఉన్నాయని విమర్శించారు. వేల ఎకరాల్లో ఉన్న ఇండస్ట్రియల్ భూములను కమర్షియల్, రియల్ ఎస్టేట్ గా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భూముల మార్పిడి ప్రక్రియలో పారదర్శకత లేకుండా నిబంధనలు మార్చడం, అసలు ప్రయోజనదారులైన పరిశ్రమల యజమానులకు సమాచారం అందించకుండా నిర్ణయాలు అమలు చేయడం సరైందికాదని ప్రతినిధులు పేర్కొన్నారు.
గవర్నర్ కు ఇచ్చిన ఫిర్యాదులో ఏముంది?
‘హిల్ట్ పాలసీని పూర్తిగా పున:సమీక్షించాలి. భూముల మార్పిడి ప్రక్రియను తక్షణం నిలిపివేయాలి. భూకుంభకోణంపై విచారణ చేపట్టాలి. అక్రమాలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అంటూ బీజేపీ తన ఫిర్యాదులో పేర్కొన్నది. గవర్నర్‌ను కలిసిన వారిలో బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, ఎన్వీ సుభాష్ తదితర ముఖ్య నేతలు ఉన్నారు.
ప్రభుత్వం పరిశ్రమలకు కేటాయించిన భూములను కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లుగా మార్చే అవకాశం ఇచ్చింది. దీని ద్వారా భూముల విలువలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి మార్పులు పారిశ్రామిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. హిల్ట్ పాలసీ అమలు జరిగిన తర్వాత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరగవచ్చని, ఇది ప్రభుత్వానికి కాకుండా ప్రభుత్వంలోని కొంతమందికి లాభం చేకూర్చే విధంగా మారుతుందనే బీజేపీ నేతలు ఆరోపించారు.
Read Also: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు మోదీ, రాహుల్‌కు ఆహ్వానం..!
Follow Us On: X(Twitter)


