హుజూర్‌నగర్‌లో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక భేటీ

కలం, హుజూర్ నగర్ : రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) పట్టభద్రులను ఓటు అడిగే నైతిక హక్కును కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పూర్తిగా కోల్పోయాయని బీజేపీ ఎమ్మెల్సీ సి. అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మండిపడ్డారు. సోమవారం హుజూర్‌నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో విద్యావంతులు, దేశభక్తి పరులు, యువత అంతా భారతీయ జనతా పార్టీ వైపే నిలబడుతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ వికృత చేష్టలతో దేశంలో అరాచకాలు, అలజడులు సృష్టించాలని చూస్తున్న దుష్టశక్తుల పట్ల యువత మేల్కోవాలని, దేశ సౌర్భౌమత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలనపై వారు ఘాటు విమర్శలు చేశారు. హుజూర్ నగర్‌లో ఉత్తమ్ ఇచ్చిన ల్యాండ్, మైన్, వైన్ స్లోగన్ ప్రకారమే దోపిడీ రాజ్యమేలుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆయనకు హెలికాప్టర్ మంత్రిగా పేరుందని, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి కూడా సొంత నియోజకవర్గంలో పంటలు ఎండిపోతుంటే పట్టించుకోకుండా సీఎం హోదా కోసం కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినా కూడా నేటికీ జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బీజేపీ 48 గంటల నిరాహార దీక్ష చేపడితే మాట ఇచ్చి తప్పించుకున్నారని మండిపడ్డారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో దళారుల దందా నడుస్తోందని, ఆరు గ్యారెంటీల అమలు ఊసే లేదని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకే నాణేనికి బొమ్మ, బొరుసని, ధరణి, భూభారతి వ్యవస్థలు రైతుల పాలిట శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల కాంట్రాక్టులన్నీ ఇతరులకే కట్టబెడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలను మోసం చేసిన ఈ ప్రభుత్వానికి పట్టభద్రులందరూ మళ్లీ ఓటరుగా నమోదు చేసుకుని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) బిజెపికి ఓటేసి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>