కలం, జోగులాంబ గద్వాల: ఆలంపూర్ (Alampur) శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ అమ్మవారి ఆలయాల్లో శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి సీతక్క (Minister Seethakka), ఎంపీ మల్లు రవి, ఇతర ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు.
ముందుగా బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న అతిథులకు అర్చకులు పూర్ణకంభంతో, మేళ తాళాలతో స్వాగతం పలికారు. ఆలయంలో అభిషేక పూజలు నిర్వహించిన అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ విశిష్టతను గురించి ప్రజాప్రతినిధులకు తెలియజేశారు. అనంతరం వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి, స్వామివారి చిత్రపటాలను, ప్రసాదాలను అందజేశారు.
అంతకుముందు హరిత హోటల్ వద్ద అతిథులకు పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆలంపూర్ మండలం బైరంపల్లి గ్రామానికి చెందిన 32 మంది లబ్ధిదారులకు మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు పలు సమస్యలపై ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ సరిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు మధుమోహన్, కృష్ణ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

