కలం, వెబ్ డెస్క్: ఏపీలో తెలంగాణ మహనీయుల విగ్రహాల ఏర్పాటు ప్రతిపాదనలను ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy) స్వాగతించారు. తెలంగాణలో జన్మించిన మేధావులు, కవులు, కళాకారులు కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాదని, వారంతా తెలుగు జాతి ఉమ్మడి ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సోదరభావం పెంచేందుకు ఇటువంటి చర్యలు దోహదపడతాయని, మహనీయుల గౌరవం విషయంలో ఎటువంటి అభ్యంతరాలు ఉండవని స్పష్టం చేశారు. ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో వేగంగా ముందుకు సాగుతుంటే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.
తెలంగాణ ఏర్పడి ఇన్నేళ్లు గడిచినా రాజకీయ లబ్ధి కోసం ఇంకా ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టడం బాధాకరమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏపీ ప్రజలను, నాయకులను టార్గెట్ చేసి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇది సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రెండు రాష్ట్రాలు పరస్పర గౌరవంతో, సోదరభావంతో అభివృద్ధి పథంలో పయనిస్తూ దేశానికి ఆదర్శంగా నిలవాలని బీజేపీ ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

