చొప్పదండిలో తీవ్ర విద్యుత్ కోతలు.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై బీజేపీ ఫైర్!

కలం, కరీంనగర్: ప్రభుత్వ అసమర్థత వల్లే చొప్పదండి (Choppadandi) మండలంలో విద్యుత్ సరఫరా తీవ్ర అస్తవ్యస్తంగా మారిందని, నిత్యం ఎదురవుతున్న కరెంట్ కోతలకు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (MLA Medipalli Satyam) పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి కృష్ణారెడ్డి (Singireddy Krishna Reddy) డిమాండ్ చేశారు.

బీజేపీ చొప్పదండి రూరల్ శాఖ అధ్యక్షులు మొగిలి మహేష్ అధ్యక్షతన చొప్పదండిలోని ఒక ఫంక్షన్ హాల్‌లలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సింగిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడారు. మండలంలోని అన్ని సబ్ స్టేషన్ల పరిధిలో కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయని, రైతులు పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిబ్బంది కొరతపై ధ్వజం

నియోజకవర్గ కేంద్రంలోని సబ్ స్టేషన్‌లో సబ్ ఇంజనీర్ పోస్ట్ ఖాళీగా ఉందని, ఆరుగురు లైన్‌మెన్‌లకు గాను కేవలం ముగ్గురు మాత్రమే విధుల్లో ఉండటంతో చొప్పదండి సెక్షన్ పరిధిలో విద్యుత్ వ్యవస్థ సంక్షోభంలో పడిందని తెలిపారు. సొంత పార్టీ అనుచరులకు పదవులు కట్టబెట్టడంలో చూపించే శ్రద్ధ, అత్యవసర సేవలు అందించే విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న లైన్‌మెన్‌ పోస్టులను భర్తీ చేయడంలో ఎమ్మెల్యే చూపకపోవడం శోచనీయమన్నారు.

లోవోల్టేజీ, సాగునీటి ఇబ్బందులు

మున్సిపాలిటీ పరిధిలోని పలు వాడల్లో లోవోల్టేజీ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మున్సిపల్ ఎన్నికల సమయంలో హైవోల్టేజ్ ఉపన్యాసాలు ఇచ్చిన అధికార పార్టీ నాయకులు ఇప్పుడు ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల కాలేశ్వరం నీళ్లు కాలువల్లోకి రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, బావుల్లో ఉన్న కొద్దిపాటి నీటితో పంటలను కాపాడుకుందామంటే విద్యుత్ కోతలు అడ్డుపడుతున్నాయని వాపోయారు. ఎక్కడైనా బ్రేక్ డౌన్ వస్తే మరమ్మతులు చేసేందుకు సిబ్బంది లేరని, తక్షణమే అనేక ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీని పెంచాలని కోరారు.

తక్షణమే విద్యుత్ సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రైతులే అధికార పార్టీ ఫ్యూజులు తొలగించి, పవర్ కట్ చేయడం ఖాయమని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు, గుమ్లాపూర్ మాజీ ఎంపీటీసీ బత్తుల లక్ష్మీనారాయణ, భూపాలపట్నం మాజీ ఉపసర్పంచ్ బైరాగోని కిట్టు గౌడ్, గుమ్లాపూర్ మాజీ ఉపసర్పంచ్ విలాసాగరం అంజయ్య, మండల ప్రధాన కార్యదర్శులు కొమ్ము రమేష్, ఎడ్ల సురేష్, గన్ను నరసింహారెడ్డి, కాయిత సాయి కృష్ణ, ఐద మారుతి, యువమోర్చా మండల అధ్యక్షులు పెద్ది వీరేశం, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు మడిపల్లి రాజు, నాయకులు ముద్దం చందు, గొల్లపల్లి ముని, మ్యాకల రాములు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>