కలం, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో అర్ధరాత్రి దారుణ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. జోగిని సుధాకర్‌ను (Jogini Sudhakar) గుర్తుతెలియని దుండగులు హత్య చేసినట్లు సమాచారం. అనంతరం ఆయన ఇంట్లో ఉన్న భారీ మొత్తంలో బంగారం, నగదు, కారును అపహరించుకెళ్లినట్లు తెలుస్తోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంట్లో సుమారు 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు ఉన్నట్లు, వాటితో పాటు కారును కూడా దుండగులు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ హత్య వెనుక అసలు కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ మొత్తంలో బంగారం, నగదు దోచుకునేందుకే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? లేక బాధితుడికి ముందే పరిచయం ఉన్నవారే ఈ ఘటనకు పాల్పడ్డారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆధారాల సేకరణ కోసం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించారు. ఇంటి పరిసరాలతో పాటు ఘటనకు సంబంధించిన ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. దుండగులు వచ్చిన మార్గం, వెళ్లిన దారి, అపహరణకు గురైన కారు ఆచూకీపై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నిందితులను గుర్తించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పట్టణ ప్రాంతంలో అర్ధరాత్రి జరిగిన ఈ హత్యతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిందితులను త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసుల దర్యాప్తు పూర్తయితేనే ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు వెలుగులోకి రానున్నాయి.

