కలం, స్పోర్ట్స్ : గోల్డ్ మెడల్‌ను కాపాడుకోవడమే లక్ష్యంగా భారత మహిళల కబడ్డీ (Kabaddi) జట్టు సిద్ధమైంది. 2026 ఐచి-నగోయా ఆసియా గేమ్స్ (Asian Games) లో భారత జట్టుకు పుష్ప రాణా (Pushpa Rana) కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. గెలుపుపై జట్టులో పూర్తి నమ్మకం ఉందని ఆమె తెలిపారు. ఆసియా గేమ్స్ కోసం జట్టు ఇప్పటికే కఠినంగా సిద్ధమైంది. ప్రత్యర్థుల ఆటను విశ్లేషించింది. గత మ్యాచ్‌లలో చేసిన తప్పులను గుర్తించింది. కోచ్‌లు సూచించిన అంశాలపై ప్రత్యేకంగా పని చేసింది. పాత తప్పులను సరిదిద్దుకుంటూ పరిస్థితులకు తగ్గట్టుగా ప్రాక్టీస్ చేస్తున్నామని పుష్ప రాణా తెలిపారు. జట్టు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని చెప్పారు.
భారత మహిళల కబడ్డీ జట్టు గత ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో చైనీస్ తైపీపై 26-25తో విజయం సాధించింది. ఇప్పుడు అదే గోల్డ్‌ను నిలబెట్టుకోవాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బాధ్యతను ఒత్తిడిగా కాకుండా ప్రేరణగా చూస్తున్నామని పుష్ప రాణా తెలిపారు. సీనియర్ ఆటగాళ్లు ఇప్పటికే మంచి విజయాలు సాధించారని, అదే ఊపును కొనసాగించేందుకు తాము కష్టపడుతున్నామని చెప్పారు. ఇది పుష్ప రాణా (Pushpa Rana) కు తొలి కెప్టెన్సీ బాధ్యత. గతంలో ఆమె వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు.
ఇప్పుడు సీనియర్ ఆటగాళ్లు రితు నేగి, సోనాలి షింగాటే సలహాలను తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ఆసియా గేమ్స్ ఫైనల్‌ను దృష్టిలో పెట్టుకుని చైనీస్ తైపీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మరోవైపు పూజా కజ్లా కూడా గోల్డ్ మెడల్‌పై దృష్టి పెట్టారు. భారత్ మరోసారి గోల్డ్ సాధిస్తే యువతులకు మరింత స్ఫూర్తి లభిస్తుందని ఆమె అన్నారు. శక్తి, ఫిట్నెస్ శిబిరంలో ఆటగాళ్లకు నిద్ర, రికవరీపై కూడా ప్రత్యేక అవగాహన కల్పించారు.
దీని ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నట్లు పూజా కజ్లా తెలిపారు. కబడ్డీ పోటీలు సెప్టెంబర్ 21న ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. సెప్టెంబర్ 23న ఇరాన్‌తో, సెప్టెంబర్ 24న జపాన్‌తో ఆడుతుంది. సెప్టెంబర్ 25న సెమీఫైనల్స్ జరుగుతాయి. సెప్టెంబర్ 26న గోల్డ్ మెడల్ మ్యాచ్ ఉంటుంది.
భారత మహిళల జట్టు: పుష్ప రాణా (కెప్టెన్), రితు నేగి, సోనాలి షింగాటే, సంజు దేవి, పూజా కజ్లా, రితు షియోరన్, జ్యోతి ఠాకూర్, పింకీ రాయ్, మనీషా కుమారి, భావనా ఠాకూర్, రాజ్ రాణి, నికితా కుమారి.
Also Read : ఆసియా గేమ్స్: శార్దూల్ అవుట్, నిగమ్ ఇన్!
Follow Us On: X(Twitter)

