కలం, ఆదిలాబాద్ : ఆదివాసీల సాంప్రదాయ ఆహార అలవాట్లు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులే సమాజ ఆరోగ్యానికి నిజమైన రక్ష అని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Rajarshi Shah) అన్నారు. బుధవారం సిరికొండ మండలం నారాయణపూర్‌లో ఆర్‌పీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆదివాసీ ఆహార వైభవం’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదివాసీల సాంప్రదాయ ఆహార అలవాట్లు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులే సమాజ ఆరోగ్యానికి నిజమైన రక్ష అని చెప్పారు.
నేటి ఆధునిక జీవనశైలిలో తలెత్తుతున్న పలు అనారోగ్య సమస్యలను అధిగమించాలంటే మళ్లీ సంప్రదాయ ఆహార విధానాల వైపు మళ్లక తప్పదని కలెక్టర్ (Rajarshi Shah) అన్నారు. మన పూర్వీకులు అందించిన సహజసిద్ధమైన ఆహార ధాన్యాలు, చిరుధాన్యాల వినియోగంతో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. సుస్థిర భవిష్యత్తు కోసం పర్యావరణహిత సేంద్రీయ సాగును, మిల్లెట్ల ఉత్పత్తిని పెద్దఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కలెక్టర్ గ్రామస్తులతో కలిసి సహ పంక్తి భోజనం చేసి, మొక్కను నాటారు.

