కలం, వెబ్ డెస్క్: మున్సిపాలిటీ పోలింగ్ జరుగుతున్న తీరుపై వైసీపీ అధినేత జగన్ (YS Jagan) సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకున్న జగన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. పులివెందులలో ఉన్న 80 బూత్‌ల్లో 70 బూత్‌ల్లో వైసీపీ ఏజెంట్లను అనుమతివ్వలేదని, మా ఏజెంట్లను బూత్‌ల్లోకి రానివ్వడం లేదని ఆయన ఆరోపించారు. కేవలం నాకు ఓటు ఉన్న బూత్ లోనే ఏజెంట్ ను కూర్చోబెట్టారని ఆయన చెప్పారు.
అధికార పార్టీకి పోలీసులు దగ్గరుండి సహకరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యమేనా అని జగన్ ప్రశ్నించారు. ఓటర్లను అడ్డుకుని ఓటర్ స్లిప్పులు లాక్కున్నారన్నారు. చైర్ పర్సన్ అభ్యర్థి ప్రమీలమ్మ పైనా, మీడియాపైనా దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికలు రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని జగన్ డిమాండ్ చేశారు. ఓటు వేయనీయడం లేదని ఓటర్లు ధర్నా చేస్తున్నారన్నారు. తప్పుడు విధానాలు సృష్టించి, భవిష్యత్ కు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని సీఎం చంద్రబాబుపై ఆయన (YS Jagan) ధ్వజమెత్తారు. ఇలాంటి వాటి వల్లే దేశంలో కాక్రోచ్ లు, మావోయిస్టులు పుట్టుకొస్తున్నారని జగన్ అన్నారు.

