కలం, కరీంనగర్ బ్యూరో : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ బీజేపీ శ్రేణులు బగ్గుమన్నాయి. గురువారం కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్ద కౌశిక్ రెడ్డి ఉన్నాడనే సమాచారం మేరకు పార్లమెంటు కన్వీనర్ బోయిన్‌పల్లి ప్రవీణ్ రావు (BJP Leader Praveen Rao) స్థానిక బీజేపీ శ్రేణులతో వెళ్లి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి బోయినపల్లి ప్రవీణ్ రావును అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రావు మాట్లాడుతూ, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.
కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే నాలుక చీరేస్తామని ప్రవీణ్ రావు (BJP Leader Praveen Rao) ఘాటుగా హెచ్చరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కు ఇచ్చిన 48 గంటల వ్యవధి దగ్గర పడిందని, డ్రగ్ ట్రస్టులకు కేటీఆర్ భయపడుతున్నారనే విషయం కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. కేటీఆర్‌కు, బీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ చేసిన సవాల్ ను స్వీకరించే దమ్ము లేక, కౌశిక్ రెడ్డి తో అనవసర వ్యాఖ్యలు, రాద్ధాంతం చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి జాగ్రత్తగా మాట్లాడాలని, లేకపోతే ఆయనను కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టనీయమని ప్రవీణ్ రావు హెచ్చరించారు.

