కలం, వరంగల్ బ్యూరో: దేశ ప్రజలకు ఉన్న ప్రజాస్వామ్య హక్కులను బీజేపీ ప్రభుత్వం విస్మరిస్తోందని వరంగల్ ఎంపీ కడియం కావ్య (MP Kadiyam Kavya) విమర్శించారు. “కాక్రోచ్ జనతా పార్టీ” అనే పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగానే ప్రశ్నించే యువత అకౌంట్లను బ్లాక్ చేయించడం బీజేపీ అసహన రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. హనుమకొండ డీ కన్వెన్షన్ సెంటర్ లో ఆదివారం నిర్వహించిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి సన్మానోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న అన్యాయాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్భయంగా ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతోందన్నారు.
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వెంటనే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను నిరసిస్తూ పార్లమెంట్ మెట్లపై జరిగిన ఆందోళనలో వేం నరేందర్ రెడ్డి తమతో కలిసి పాల్గొనడం శుభసూచకమన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న వేం నరేందర్ రెడ్డి (MP Kadiyam Kavya) రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ప్రజా సమస్యలపై అవగాహనతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవం కలిగిన నాయకుడిగా ఆయన సేవలు దేశ స్థాయిలో తెలంగాణ స్వరాన్ని మరింత బలంగా వినిపిస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకెట్‌లా ముందుకు దూసుకెళ్తుంటే, ఆ రాకెట్‌కు నిప్పురవ్వలా వేం నరేందర్ రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడారు. చిరునవ్వుతో, సహనంతో, అందరినీ కలుపుకొని ముందుకు సాగే నాయకుడు వేం నరేందర్ రెడ్డి అని కొనియాడారు. భవిష్యత్‌లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకురావడంలో వేం నరేందర్ రెడ్డి కృషి ఎంతో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క), శాసనసభ్యులు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, జాటోత్ రామ్ చందర్ నాయక్, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Read Also : స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ ఓ స్కామ్: జగదీశ్ రెడ్డి
Read Also: సర్కారు ఆసుపత్రులు అస్తవ్యస్తం

