కలం, వరంగల్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి (Bhu Bharati) వెబ్ సైట్ కొందరు కేటుగాళ్ళ చేతిలో పడింది. వరంగల్, జనగామ జిల్లాల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డిజిటల్ ఫ్రాడ్ చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. కేవలం పది రిజిస్ట్రేషన్ల ద్వారానే ప్రభుత్వానికి రూ. 8.55 లక్షల నష్టం వాటిల్లింది. ఇది ఒక నీటిబొట్టు మాత్రమేనని, భారీ స్థాయిలోనే మోసం జరిగిందని రెవెన్యూ అధికారుల అనుమానం. పది రిజిస్ట్రేషన్ల వివరాలను చూసిన తర్వాత అనుమానం వచ్చిన జనగామ తాసీల్దారు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. స్లాట్ బుకింగ్ మొదలు రిజిస్ట్రేషన్ వరకు సాఫ్ట్‌వేర్‌లోని లొసుగులను వాడుకుంటున్న కేటుగాళ్ళు భూ లావాదేవీల్లో ప్రజల నుంచి పూర్తిస్థాయిలో డబ్బులు వసూలు చేసుకుని ప్రభుత్వానికి చెల్లించకుండా నొక్కేస్తున్నారు. మార్కెట్ వ్యాల్యూ ప్రకారం పేమెంట్స్ జరగకపోవడంతో అసలు విషయం బైటకు వచ్చింది.
డిజిటల్ మాడిఫికేషన్స్ తో మోసం :
ఈజీ మనీ కి అలవాటు పడిన సైబర్ కేటుగాళ్ళు భూభారతి (Bhu Bharati) సైట్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకుంటున్నారు. స్థలం రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన భూ యజమానుల నుంచి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు పూర్తిస్థాయిలో పేమెంట్ జరుగుతున్నది. కానీ ఖజానాలో అవి జమ కావడంలేదు. గత నెల 24న జనగాంలో జరిగిన పది భూ లావాదేవీలను పరిశీలించిన తర్వాత తాసీల్దారుకు అనుమానం వచ్చి ఆ వివరాలను పరిశీలించారు. భూ యజమానుల నుంచి పూర్తి స్థాయిలో వసూలైన తర్వాత ఖజానాకు జమకాకపోవడంపై ఆరా తీశారు. భూ యజమానులు పేమెంట్ చేసిన తర్వాత స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు సక్రమంగానే జరిగినట్లు రసీదుల ద్వారా స్పష్టమైంది. కానీ ఖజానాకు జమ చేసే సమయంలో మాత్రం మోసం జరిగినట్లు ధృవీకరించుకున్నారు. డిజిటల్ పద్ధతిలో ఫ్రాడ్‌కు పాల్పడి మోసం చేస్తున్నట్లు గ్రహించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డెవలపర్‌కు తెలియకుండానే జరిగిందా? :
భూ యజమానుల నుంచి పూర్తి స్థాయిలో వసూలు చేసిన తర్వాత రసీదులో మార్పులు ఎలా సాధ్యమైందనే టెక్నికల్ కోణం నుంచి ఆలోచన చేసిన జనగాం తాసీల్దారు మరింత లోతుగా పరిశీలించడం మొదలుపెట్టారు. నకిలీ రసీదులు తయారుచేసినట్లు గుర్తించారు. సాఫ్ట్ వేర్‌లో సరైన గణాంకాలు ఉండి నకిలీ చలాన్లలో మాత్రం తక్కువ మొత్తాన్ని చూపించడం ఎలా సాధ్యమవుతుందని ఆరా తీసిన తర్వాత డిజిటల్ డివైజ్‌ల ద్వారా ఫ్రాడ్‌కు పాల్పడినట్లు ధృవీకరించుకున్నారు. వెబ్‌సైట్, సాఫ్ట్ వేర్‌లోని లొసుగులను కొద్దిమంది హ్యాక్ చేయడంలో సాధ్యాసాధ్యాలపై లోతుగా పరిశీలన చేశారు. డెవలపర్ స్థాయి నుంచే కొద్దిమందికి ఏమైనా సంబంధాలున్నాయేమో అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఒక్క రోజులో జరిగిన పది భూలావాదేవీల్లో రూ. 8.55 లక్షల మేర గోల్‌మాల్ జరిగి ప్రభుత్వ ఖజానాకు గండి పడడాన్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నారు.
పోలీసుల అదుపులో యువకుడు :
యాదగిరిగుట్టకు చెందిన ఒక యువకుడు భూ రిజిస్ట్రేషన్‌ల కోసం వచ్చే యజమానులను టెక్నాలజీ ద్వారా బోల్తా కొట్టించినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కానీ అదుపులోకి తీసుకున్న విషయాన్ని మాత్రం గోప్యంగానే ఉంచినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ఆ యువకుడికి సాఫ్ట్ వేర్ డెవలపర్‌తో ఉన్న సంబంధాలతో పాటు హైదరాబాద్‌లోని మరికొద్దిమందితో ఉన్న లింకులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది కూడా ఆ యువకుడికి సహకరిస్తున్నారా?.. కమిషన్ల రూపంలో వారి మధ్య లోపాయకారీ ఒప్పందాలు ఉన్నాయా?.. ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారం నడుస్తున్నది?.. ఆ యువకుడు ఎంతమందికి స్లాట్‌లు బుక్ చేశారు?.. జరిగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎన్ని?.. వాటి ద్వారా ఖజానాకు ఏ మేరకు నష్టం జరిగింది?.. ఇలాంటి వివరాలను రాబడుతున్నారు.
సైట్ పకడ్బందీగా రూపొందినా?.. :
గత ప్రభుత్వంలో ధరణి ద్వారా మరో రూపంలో భూ లావాదేవీల్లో మోసాలు జరిగితే ఇప్పుడు భూభారతి ద్వారా ఇంకో రూపంలో జరగడం గమనార్హం. సైట్‌ను పకడ్బందీగా రూపొందించినట్లు ప్రభుత్వం చెప్తున్నా టెక్నాలజీలో మాడిఫికేషన్స్ ద్వారానే ఖజానాకు గండి పడడం అధికారులను కూడా విస్మయానికి గురిచేసింది. వెలుగులోకి వచ్చిన వివరాలే ఈ స్థాయిలో ఉంటే ఇంతకాలం ఎన్ని మోసాలు జరిగాయనేది అంచనాకు కూడా అందడం లేదు. జనగామ, వరంగల్ కేంద్రాల్లో మాత్రమే ఈ దందా నడుస్తున్నాదా?.. లేక ఇతర జిల్లాల్లోనూ సైబర్ కేటుగాళ్ళ ప్రమేయం ఉన్నదా?.. ఇప్పుడు ఇవీ పోలీసులకు సవాలుగా మారాయి. అదుపులో ఉన్న వ్యక్తి ద్వారా రాబట్టే సమాచారానికి అనుగుణంగా ఈ నెట్ వర్క్ వెనక ఎవరున్నారనేది రానున్న రోజుల్లో బహిర్గతం కానున్నది.
Read Also: ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు నా మద్దతు.. కేటీఆర్
Follow Us On: Instagram


