epaper
Sunday, March 1, 2026
epaper

ఖమ్మంలో భూదాన్ భూముల వివాదం.. అసలు నిజాలు ఇవే..

కలం/ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam)  నగరం, వెలుగుమట్లలోని వినోభానగర్ భూదాన్ భూముల (bhoodan Lands) సమస్య దాదాపు దశాబ్దకాలంగా స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ప్రభుత్వాలకు మధ్య పేదలు నలిగిపోతున్నారు. ఎప్పుడు పోలీసులు వస్తారో? ఎప్పుడు రెవెన్యూ అధికారులు వచ్చి ఖాళీ చేయమంటరో తెలియని పరిస్థితి? అసలు ఈ భూదాన్ భూముల విషయంలో వాస్తవాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

వివాదం ఇదే..

ఖమ్మం (Khammam) జిల్లా వెలుగుమట్ల (Velugumatla) రెవెన్యూ పరిధిలోనీ 147, 148, 149, 160 సర్వే నెంబర్లలో 62.7 ఎకరాల భూదాన్ భూమి ఉంది. ఈ భూమిని రాయల కోటేశ్వర‌రావు అనే భూస్వామి 1951- 1955 మధ్య కాలంలో భూదాన్ బోర్డుకు అప్పగించారు. ఆచార్య వినోబాబావే ఆశయాలకు ప్రభావితమై నిరుపేదలకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ భూమిని దానం చేసినట్లు అప్పటి తరం వారు చెప్తున్నారు. అప్పట్లోనే ఈ భూములను భూదాన్ యజ్ఞ బోర్డు పేరిట ముంతఖబ్‌లలో నమోదు చేశారు.

ప్రస్తుతం రూ. కోట్ల విలువ

దశాబ్దాల క్రితం దానం చేసిన ఈ భూమి, ఖమ్మం నగర విస్తరణ వలన ప్రస్తుతం కోట్ల రూపాయల విలువ పలుకుతోంది. దీంతో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఈ భూమి మీద కన్ను వేసి తప్పుడు పత్రాలు సృష్టించి ఇతరులకు అమ్మడం మొదలు పెట్టారు. 2014 నుంచి ఎంతో మంది పేదలు భూములు కొన్నారు. దాదాపు 200లకు పైగా గృహాలు వెలిశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. ఈ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టొద్దని కోర్టు స్టే విధించింది.

ప్రభుత్వమే ఇచ్చిందంటున్న బాధితులు

2014లో అప్పటి భూదాన్ బోర్డు (Bhoodan Board) తమకు 100 గజాల చొప్పున ఇళ్ల స్థలాల కోసం పట్టాలు ఇచ్చిందని ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న పేదలు చెబుతున్నారు. అందుకే తాము ఇక్కడ గుడిసెలు వేసుకున్నామని బాధితులు వాదిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం భూదాన్ భూములను విక్రయించడం లేదా ఆక్రమించడం చట్టవిరుద్ధమని అంటుంది. కొందరు మధ్యవర్తులు (బ్రోకర్లు) పేదల నుంచి డబ్బులు వసూలు చేసి వారిని రెచ్చగొట్టి ఆక్రమణలకు పాల్పడుతున్నారని జిల్లా యంత్రాంగం ఆరోపణలు చేస్తుంది. ​జూలై 2023న వందలాది మంది వెలుగుమట్ల భూముల్లో రాత్రికి రాత్రే షెడ్లు, గుడిసెలు నిర్మించారు. వీటిని తొలగించడానికి రెవెన్యూ అధికారులు, పోలీసులు భారీగా తరలిరావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

పోలీసులు లాఠీచార్జ్ చేయగా, ఆందోళనకారులు కర్రలతో ప్రతిఘటించారు. తర్వాత 2024 ఆగస్టులో కూడా ప్రైవేటు వ్యక్తులు, పోలీసులు కలిసి అక్కడి షెడ్లను తొలగించే ప్రయత్నం చేయగా ఘర్షణలు జరిగాయి. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు ఇలా తొలగించడంపై అప్పట్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా మళ్ళీ మంగళవారం తెల్లవారుజామునుంచే నాలుగు జిల్లాలకు చెందిన 2000మంది పోలీసులు మోహరించి ఇళ్లను కూల్చడం ప్రారంభించారు. బాధితులు ఎంత ప్రతిఘటించినా ఇళ్లను ఆపే ప్రసక్తే లేదంటున్నారు.రెండు వందలకు పైగా ఇళ్ళు ఉంటే అందులో కేవలం తొమ్మిది ఇళ్లకే కోర్టు అనుమతి ఇవ్వగా మిగిలినవి అన్నీ అక్రమ నిర్మాణాలే అని అధికారులు చెప్తుండటం గమనార్హం.

ఇండ్లు కట్టుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నారు?

ఈ భూముల విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. భూముల అమ్మకాలు జరుగుతున్నపుడు, ప్రజలు ఇళ్లు నిర్మించుకున్నప్పుడు ప్రభుత్వం ఏం చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం స్పందించి ఆపి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చి ఉండేది కాదు. ఎన్నికల సమయంలో కూడా పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు భూములపై హక్కులు కల్పిస్తామని చెప్పి,ఇప్పుడు పత్తా లేరని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇక్కడ భూములు కొనుగోలు చేసిన పేదలు మాత్రం ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారు.

Read Also: దారుణం.. 2 నెలల బిడ్డను పొయ్యిలో వేసి చంపిన తల్లి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!