కలం/ఖమ్మం బ్యూరో: కనీవినీ ఎరుగని రీతిలో మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పేర్కొన్నారు. ఈ నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉందని చెప్పారు. మధిరను అభివృద్ధిలో ఉరకలు పెట్టిస్తానని అన్నారు. ఆదివారం మధిర పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. దేశ స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి 86 మందితో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఏర్పడిన అద్భుతమైన రోజు డిసెంబర్ 28 అని డిప్యూటీ సీఎం తెలిపారు.
మధిర పట్టణ ప్రజల అవసరాలు డ్రైనేజీ ఇతర ఏ సేవలకైనా మాకోసం ఒక కార్యాలయం ఉంది, సిబ్బంది ఉన్నారు అన్న భావన కల్పించేందుకు ఈ భవనానికి శంకుస్థాపన చేస్తున్నట్టు తెలిపారు. భారత స్వాతంత్ర సమరానికి పునాది పడింది మధిర పట్టణాల్లోనే. స్వాతంత్ర సమరయోధులకు ఆశ్రయము కల్పించింది ఈ పట్టణంలోనే అని తెలిపారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని ఆవిష్కరించకుండా నిజాం ప్రభుత్వం నిషేధం విధిస్తే సర్దార్ జమలాపురం కేశవరావు సవాల్ విసిరి మారువేషంలో మధిర నడిబొడ్డున మూడు రంగుల జెండా ఎగురవేశారని అది స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించింది అని భట్టి తెలిపారు.
ఔటర్ రింగురోడ్డు నిర్మిస్తాం
మధిర నియోజకవర్గానికి ఔటర్ రింగు రోడ్డు మంజూరు చేస్తామని భట్టి హామీ ఇచ్చారు. ఒకపక్క ఏరు మరోపక్క చెరువుతో మధిర పట్టణం విస్తరణ సమస్యను ఎదుర్కొంటుందన్నారు. జనం మాత్రం మధిరలో నివసించేందుకు పోటీ పడుతున్నారని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశామని.. భూ సేకరణకు నిధులు కూడా కేటాయించామని తెలిపారు. మధిర పట్టణంలో డ్రైనేజీ నీరు బయటికి రాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు వేగంగా చేపడుతున్నట్టు తెలిపారు.
హౌసింగ్ కాలనీ నిర్మిస్తాం
మధిర పట్టణంలోని పేదలు నివసించడానికి జి ప్లస్ టు టవర్స్‌తో హౌసింగ్ కాలనీ నిర్మించబోతున్నాం త్వరలోనే ఈ కార్యక్రమానికి భూమి పూజ చేస్తామని డిప్యూటీ సీఎం వివరించారు. కోర్టు కొత్త బిల్డింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. మధిర పరిసర ప్రాంతాల్లోని రైతులు వారి ఉత్పత్తులను మధిర పట్టణంలో అమ్ముకునేందుకు, మధిర పట్టణ వాసులకు తాజా కూరగాయలు అందుబాటులోకి తెచ్చేందుకు రైతు బజార్ ఏర్పాటు చేశానని డిప్యూటీ సీఎం అన్నారు.
మధిరను విద్యా కేంద్రంగా మారుస్తాం
మధిరను విద్యా కేంద్రంగా మార్చాలని ఆలోచనతోనే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల, రెగ్యులర్ పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐలను తీసుకువచ్చినట్టు తెలిపారు. ‘ఇక్కడి యువత చదువు పూర్తి చేసుకుని ప్రభుత్వ , ప్రైవేట్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లి లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నారు. అయినా ఉద్యోగం రాక యువత, ఖర్చులు భరించలేక మన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని నా పాదయాత్ర సమయంలో అనేకమంది వివరించారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు మధిర పట్టణంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ను మంజూరు చేశామని తెలిపారు.
ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చెందాలి
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చెందితే స్థానిక రైతులకు యువతకు మేలు చేకూరుతుందన్న ఆలోచనతో మధిర, ఎర్రుపాలెం రెండు ప్రాంతాల్లో ఆధునిక ఇండస్ట్రియల్ పార్కులు ప్రారంభించామన్నారు. ఈ పారిశ్రామిక పార్కుల్లో పరిశ్రమలు పెట్టుకోవడానికి అవసరమైన కరెంటు, నీళ్లు, రోడ్డు, మార్కెట్ వంటి అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకుంటే పరిశ్రమలు పెట్టుకునేందుకు స్థలాలు కేటాయిస్తాం అన్నారు. గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్టే మధిర పట్టణంలోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు మెప్మా ద్వారా వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు.
మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తామన్న Bhatti Vikramarka
ఎన్ని ఎక్కువ గ్రూపులు పెట్టుకుంటే అంత మంచిదన్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్, సబ్బులు, అగరవత్తుల తయారీ వంటి కార్యక్రమానికి వారం రోజుల్లో భూమి పూజ చేయనున్నట్టు డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. మధిర పట్టణం మన అందరిదీ పట్టణానికి సమీపంలో అమరావతి నగరం, బందర్ పోర్టు, రైల్వే ట్రాక్, నాలుగు గ్రీన్ ఫీల్డ్ హైవేలు వెళ్తున్నాయి ఇక్కడ ఉత్పత్తి చేసే వస్తువులన్నిటిని సులభంగా రవాణా చేసుకునే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం వివరించారు. మధిర పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతోంది, ఐదు చెరువులను అభివృద్ధి చేస్తున్నాం, జమలాపురం ఆలయాన్ని టెంపుల్ టూరిజం కింద అభివృద్ధి చేస్తున్నాం. నియోజకవర్గంలో మొత్తంగా టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధి చేయనున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
Read Also: ‘జయా ఆంటీ మాలూమ్ తేరా కో’.. అంటే కుదరదంటోన్న సజ్జనార్
Follow Us On: X(Twitter)


