కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాల (హాస్టళ్ల) నిర్వహణకు ఎదురవుతున్న ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరిస్తూ ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పేర్కొన్నారు. గతంలో నిధుల చెల్లింపుల్లో నెలకొన్న జాప్యానికి స్వస్తి పలికి, ఇకపై ప్రతి నెలా సకాలంలో ‘డైట్’, ‘కాస్మెటిక్స్’, ‘భవన అద్దె’ నిధులను విడుదల చేసేలా నెలవారీ చెల్లింపులను తీసుకువచ్చామని చెప్పారు. 2026-27 బడ్జెట్ సందర్భంగా ఇచ్చిన ఈ హామీని అమలు చేస్తూ, మొదటి విడతగా రూ. 221.24 కోట్లను విడుదల చేశామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యా శాఖల పరిధిలోని విద్యార్థులకు పోషకాహారం, మెరుగైన వసతులు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. అణగారిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు.

