లక్షలాది మంది కార్మికులకు లబ్ధి చేకూరేలా ప్ర‌భుత్వం నిర్ణ‌యం: భట్టి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల స్థితిగతులను మెరుగు పరిచేందుకు ప్ర‌జా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. వారికి మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో క‌నీస వేత‌నాల స‌వ‌ర‌ణ‌పై కేబినెట్ స‌బ్ క‌మిటీ స‌మావేశం జరిగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేతనాల సవరణ శాస్త్రీయంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాల్లో అమలవుతున్న కనీస వేతనాల విధానాలను కమిటీ కూలంకషంగా పరిశీలించిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తీసుకురానున్న నూతన ‘లేబర్ కోడ్’ (Labour Code) అంశాల ప్రభావం ఎలా ఉండబోతోందనే దానిపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ఈ ప‌మావేశంలో భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటుగా మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, లేబ‌ర్ క‌మిష‌న‌ర్ దాస‌రి హ‌రి చంద‌న‌, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ సెక్రెట‌రి గౌర‌వ్ ఉప్ప‌ల్‌, ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

కార్మికుల వేతనాలను కేవలం అంకెల్లో కాకుండా, వారి వాస్తవ అవసరాలకు అనుగుణంగా సవరించాలని కమిటీ నిర్ణయించిందని భట్టి తెలిపారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు ఉండాల‌ని కేబినెట్ సబ్ క‌మిటీ నిర్ణ‌యించిందని చెప్పారు. దేశంలోని అత్యుత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేయాల‌ని ప్ర‌భుత్వం ధృఢ సంత‌క‌ల్పంతో ఉంద‌ని కేబినెట్ స‌బ్ క‌మిటీ అభిప్రాయ ప‌డిందని వివరించారు. రాష్ట్రాన్ని కార్మికుల పక్షపాతి రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. త్వరలోనే అన్ని వర్గాల అభిప్రాయాలను క్రోడీకరించి, కార్మికులకు మేలు చేకూర్చే విధంగా కనీస వేతనాల సవరణపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అసంఘటిత, సంఘటిత రంగ కార్మికులకు లబ్ధి చేకూరేలా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>