కలం, వెబ్ డెస్క్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తన సొంత నియోజకవర్గానికి మరో భవనాన్ని మంజూరు చేసుకున్నారు. ఇప్పటికే క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించుకోగా ఇప్పుడు సమీకృత మండల కార్యాలయానికి మరో అప్రూవల్ మంజూరైంది. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో రెండు అంతస్తుల (ఫస్ట్, సెకండ్ ఫ్లోర్) భవనాన్ని నిర్మించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. మొత్తం రూ. 14.15 కోట్ల ఖర్చుతో ఈ కార్యాలయం నిర్మాణమయ్యేలా కసరత్తు మొదలైంది. ఈ ఖర్చుకు జీఎస్టీ భారం అదనం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సొంత పార్టీ నేతలే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి అన్నీ వారి నియోజకవర్గాలకే మంజూరవుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కామెంట్లు వచ్చిన రోజుల వ్యవధిలోనే మధిరలో ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయాన్ని నిర్మించుకోడానికి ప్లానింగ్ రెడీ అవుతున్నది.
రెండేండ్ల వ్యవధిలో ఈ భవన నిర్మాణం పూర్తయ్యేలా ఆదేశాలు జారీ అయ్యాయి. భవనంతో పాటు నీటి సంప్, సెప్టిక్ట ట్యాంక్, చుట్టూ ప్రహరీ గోడ, భవనం లోపల ఫ్లోరింగ్‌కు వాడాల్సిన గ్రానైట్ స్టోన్స్, కిటికీలకు వాడే పీవీసీ విండోస్.. ఇలా అన్నింటికీ స్పష్టమైన డిజైన్ కూడా ఖరారైంది. ఈ నెల చివరి లోగా నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులను చేపట్టేలా శాఖాపరమైన ప్రణాళిక సిద్ధమైంది. రెండేండ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ నియోజకవర్గంలో ఈ భవనం ఒక సక్సెస్ అస్త్రంగా డిప్యూటీ సీఎంకు ఉపయోగపడనున్నది. చాలా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేలు రిక్వెస్టులు పెట్టినా నిధుల కొరత కారణంగా మంజూరు చేయడంలేదని ఆరోపణలు వస్తున్న సమయంలో మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం (Bhatti Vikramarka) ఈ భవనాన్ని నిర్మించేలా కార్యాచరణ మొదలుపెట్టడం గమనార్హం.
Read Also: పాల్వంచ జాతీయ రహదారిపై పొంచి ఉన్న ‘తారు’ ముప్పు
Follow Us On: X(Twitter)

