కలం, వెబ్ డెస్క్: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా (Air India) గొప్ప నిర్ణయం తీసుకుంది. సైన్యంలో అమరవీరులు, దివ్యాంగులుగా మారిన వారి కుటుంబాలకు అండగా నిలబడాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు 20 మంది యుద్ధ వితంతువులు (వీర నారీలు), 40 మంది పిల్లలకు వెంటనే ఉద్యోగాలు కల్పించేలా గురువారం సైన్యంతో కలిసి ఎయిరిండియా ఒప్పందం కుదుర్చుకుంది. వీరికి కస్టమర్ సేవలు, లోడ్ అండ్ కంట్రోల్, ర్యాంప్ ఆపరేషన్స్ విభాగాల్లో శిక్షణ ఇచ్చి.. తరువాత శాశ్వతంగా ఉద్యోగాల్లోకి తీసుకోబోతున్నారు.
వృత్తి విద్యా ల్యాబ్‌ల ఏర్పాటు..
సర్వీసులో ఉండగా దివ్యాంగులైన సిబ్బంది పిల్లల సంక్షేమానికి ఆర్మీ దేశ వ్యాప్తంగా 25 ఆశా పాఠశాలలు నిర్వహిస్తోంది. వీటిల్లో ఫొటోగ్రఫీ, మ్యూజిక్, కుకింగ్, హాస్పిటాలిటీ, సాంకేతిక నైపుణ్యాలు వంటి వైవిధ్యమైన రంగాల్లో వృత్తి విద్యా ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని ఎయిరిండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 10 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి ల్యాబ్స్ ఏర్పాటు చేసింది. త్వరలోనే మిగతావాటికి విస్తరించబోతుంది.

