కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో డ్రగ్స్ వినియోగంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డ్రగ్స్ కేసులో దొరికితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి ఎలాంటి కఠిన నిర్ణయమైనా తీసుకుంటానని స్పష్టం చేశారు. జీవితం చాలా విలువైనదని, డ్రగ్స్ బారిన పడి నాశనం చేసుకోవద్దని తెలంగాణ సమాజానికి సూచించారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా శుక్రవారం రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన “మాదక ద్రవ్యాల దుర్వినియోగం – అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం” పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ఈగల్ ఫోర్స్ & వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
మత్తు పదార్థాలకు “నో” చెప్పండి..
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈగల్ ఫోర్స్ సంపూర్ణంగా పనిచేసేలా అన్ని వసతులు కల్పించామని వెల్లడించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని చెప్పారు. మత్తు పదార్థాలకు “నో” చెప్పి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణానికి అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పుట్టిపెరగటం ఒక భరోసాగా భావించే పరిస్థితులను రాష్ట్రంలో తమవంతు బాధ్యతగా కల్పిస్తున్నామని చెప్పారు. సమాజంలో పరివర్తన రాకుంటే, ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం శూన్యమని అభిప్రాయపడ్డారు.
సినీ నటులు వీడియో సందేశం ఇవ్వాలి..
సినీ నటులు ఇచ్చే సందేశం సమాజంలోకి బలంగా వెళ్తోందన్న భట్టి.. నటులంతా తమ బాధ్యతగా ‘సే నో టూ డ్రగ్స్ (Say No to Drugs)’ వీడియో సందేశం ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తారని భట్టి చెప్పారు. పిల్లల తల్లిదండ్రుల్ల వలె ఈ ప్రభుత్వం కూడా ప్రజలను కాపాడుకోవాలని ప్రయత్నిస్తోందన్నారు. సమాజ శ్రేయస్సు కోసం పోలీసులు ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నారని అన్నారు, జీవితాలను రిస్క్‌లో పెట్టి, డ్రగ్స్ ముఠాలను పట్టుకుంటున్నారని పోలీస్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్, సందీప్ కుమార్ శాండిల్య, అనితా రామచంద్రన్, సినీ నటుడు రామ్ పోతినేని, సినీ నటి మీనాక్షి చౌదరి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

