కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు గురువారం ఖమ్మం (Khammam) జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగమై ప్రజాస్వామ్య పాలన దశలోకి ప్రవేశించిందని గుర్తుచేశారు.
దేశ ఏకీకరణ కోసం, స్వేచ్ఛ కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పాలనను దిగ్విజయంగా కొనసాగిస్తోందని, సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ప్రతి కుటుంబ ప్రయోజనమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ముఖ్యంగా రైతులకు, మహిళలకు అండగా నిలవడమే ఈ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని డిప్యూటీ సీఎం (Mallu Bhatti Vikramarka) ఉద్ఘాటించారు. ఖమ్మం జిల్లాలో 1.31 లక్షల మంది రైతులకు రూ.912.61 కోట్ల పంట రుణాలు మాఫీ చేయడంతో పాటు, 3.41 లక్షల మందికి రూ.427.96 కోట్ల రైతు భరోసా అందించామని పేర్కొన్నారు.
మద్దతు ధరతో మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేసి రూ.1,028 కోట్లకు పైగా మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. సాగునీటి రంగానికి ప్రాధాన్యమిస్తూ సీతారామ ఎత్తిపోతల, పాలేరు లింక్ కాలువ ద్వారా 1.38 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నామని తెలిపారు. ఖమ్మం నగరాన్ని మున్నేరు వరదల నుంచి రక్షించేందుకు రూ.525.36 కోట్లతో వరద రక్షణ గోడ, రూ.180 కోట్లతో కేబుల్ వంతెన నిర్మాణం వేగవంతం చేశామని చెప్పారు.
మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ మహాలక్ష్మి పథకం కింద జిల్లా మహిళలకు రూ.343.44 కోట్ల ఉచిత ఆర్టీసీ ప్రయాణ లబ్ధి చేకూరిందని, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి ప్రభుత్వం రూ.93.45 కోట్ల సబ్సిడీ భరించిందని వివరించారు. మహిళా సంఘాలకు రూ.468 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేసి, మధిరలో రూ.2 కోట్లతో ఇందిరా డెయిరీ యూనిట్లకు శ్రీకారం చుట్టామన్నారు.
అలాగే గృహజ్యోతి కింద 2.49 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, క్రిటికల్ కేర్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్‌తో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. విద్యావికాసం, టీ-ఐపాస్ ద్వారా రూ.577 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధితో ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచుతామని డిప్యూటీ సీఎం పునరుద్ఘాటించారు.

