కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల (Graduate MLC Elections)కు కసరత్తు ప్రారంభమైంది. మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్, అలాగే వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలు మార్చి 2027 నాటికి ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో నూతన ఓటరు జాబితా తయారు చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయడంతో, తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఓటరు నమోదు ప్రక్రియ షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ఈ షెడ్యూల్ ప్రకారం 2026 సెప్టెంబర్ 28న పబ్లిక్ నోటీసు జారీ కానుంది. అక్టోబర్ 15, అక్టోబర్ 25 తేదీల్లో పత్రికల్లో పునఃప్రకటనలు వెలువడుతాయి. అర్హులైన పట్టభద్రులు ఫారం 18 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి 2026 నవంబర్ 6 చివరి తేదీగా నిర్ణయించారు. నవంబర్ 25న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. ఆ తర్వాత అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ చేపట్టి, అన్నింటినీ పరిష్కరించిన అనంతరం 2026 డిసెంబర్ 30న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు.
గతంలో ఓటరుగా నమోదైన వారు కూడా తప్పనిసరిగా మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. సీఈఓ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో గానీ, సంబంధిత అధికారులకు నేరుగా లేదా తపాలా ద్వారా గానీ ఫారం 18 సమర్పించవచ్చు. 2026 నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు.

