కలం, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy)కి సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత మొదలైంది. మల్లారెడ్డి ఫ్యామిలీ పేరుతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు చించేశారు. మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కుత్బుల్లాపూర్‌లో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందులో మల్లారెడ్డి, ఆయన కుమారుడు, కోడలు ప్రీతిరెడ్డి ఫోటోలు ఉన్నాయి. కానీ, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఫోటోలు లేవని పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా మల్లారెడ్డి పార్టీ మారుతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. కొన్ని నెలల నుంచి ఆయన పార్టీలో యాక్టీవ్‌గా ఉండటం లేదు.
అదే సమయంలో ఆయన కోడలు ప్రీతి రెడ్డి ఢిల్లీ, హైదరాబాద్‌లో బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. దీంతో మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతోందని కథనాలు వెలువడ్డాయి. అయితే ఇటీవల నిర్వహించిన కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనల్లో మల్లారెడ్డి హల్‌చల్ చేశారు. క్షేత్రస్థాయిలో ర్యాలీలో పాల్గొన్నారు. అయినా ఆయన పార్టీ మారబోతున్నారన్న పుకార్లకు ఎండ్ కార్డ్ పడటం లేదు. మల్లారెడ్డి పొద్దున ఓ పార్టీలో, సాయంత్రం మరో పార్టీలో ఉంటూ రాష్ట్రంలో వ్యాపారం చేసుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విమర్శిస్తున్నారు.

