కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలో చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య అధికంగా ఉందని, వారందరికీ ఉపాధి లభించాలంటే జిల్లాకు భారీ పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అభిప్రాయపడ్డారు. ఈ మేరకు జిల్లాలో ఒక భారీ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని, అలాగే కీలకమైన ప్రాజెక్టులను కేటాయించాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
జిల్లాలోని ముగ్గురు మంత్రులు సమన్వయంతో పని చేస్తూ సాగునీరు, విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని భట్టి విక్రమార్క వివరించారు. ముఖ్యంగా జేఎన్టీయూ యూనివర్సిటీ బ్రాంచ్ ఏర్పాటు, నర్సింగ్ కళాశాల స్థాపనతో పాటు మున్నేరును పాలేరుకు అనుసంధానం చేసే సాగునీటి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి పనులన్నింటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్‌కు అఖండ విజయాన్ని అందించారని, 85 శాతం స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలవడం జిల్లా చరిత్రలోనే ఒక రికార్డు అని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కొనియాడారు. ఈ విజయంతో ఖమ్మం జిల్లా రాష్ట్రానికే తలమానికంగా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. అదే ఉత్సాహంతో రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


