కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో పాలన గాడి తప్పడం, ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజా వ్యతిరేకత పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో అసహనం పతాక స్థాయికి చేరిందని బీజేపీ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల సహ ఇన్‌చార్జి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి (Ponguleti Sudhakar) ఎద్దేవా చేశారు. ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన సీఎం తీరుపై నిప్పులు చెరిగారు. సీపీఐ శతవార్షికోత్సవ వేదికను కూడా తన రాజకీయ ఆక్రోశాన్ని వెళ్లగక్కడానికి వాడుకోవడం రేవంత్ రెడ్డి దివాలాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
అడ్రస్ లేని గ్యారెంటీలు..
“అధికారంలోకి వచ్చేందుకు ఆనాడు ఆర్భాటంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఇప్పుడెక్కడ?” అని పొంగులేటి సూటిగా ప్రశ్నించారు. “రైతులకు భరోసా లేదు, యువతకు ఉపాధి లేదు, మహిళలకు రక్షణ లేదు. అన్ని వర్గాలను కాంగ్రెస్ నిలువునా మోసం చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక, ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. ముఖ్యమంత్రి బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు” అని పొంగులేటి సుధాకర్ (Ponguleti Sudhakar) దుయ్యబట్టారు.
సిద్ధాంతాలు లేవు.. అంతా వ్యాపారమే
కమ్యూనిస్టు పార్టీలపై పొంగులేటి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకప్పుడు వర్గ పోరాటాలు, సిద్ధాంతాల గురించి మాట్లాడిన కమ్యూనిస్టులు.. నేడు కేవలం ఒకటి రెండు సీట్ల కోసం, ఉనికిని కాపాడుకోవడం కోసం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీలు నేడు ‘పొలిటికల్ కమర్షియల్ అవుట్‌ఫిట్లు’ (రాజకీయ వ్యాపార సంస్థలు)గా మారిపోయాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీలతో జతకట్టి కాంగ్రెస్ నాటకాలాడుతోందని ఎద్దేవా చేశారు.


