కలం, మెదక్ బ్యూరో : మున్సిపాలిటీ ఎన్నికలకు రెడీ అవుతున్న వేళ సంగారెడ్డి (Sangareddy) అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అలాగే బీఆర్ ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ లో ఎవరు పైచేయి సాధిస్తారనే అంశం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా హట్ టాపిక్ గా కన్పిస్తుంది. గ్రేడ్ వన్ సంగారెడ్డితోపాటు సదాశివపేట మున్సిపాలిటీలుగా ఉన్నాయి. సంగారెడ్డి (Sangareddy) మున్సిపాలిటీ పరిధిలో 38 వార్డులు, 82,472 మంది ఓటర్లు ఉన్నారు. సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలో 26 వార్డులు, 37,196 మంది ఓటర్లున్నారు. ఈ రెండు మున్సిపాలిటీల చైర్మన్ పదవులను జనరల్ మహిళకు కేటాయించారు. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు మొత్తం 2,03,379 ఉండగా, ఈ రెండు రెండు మున్సిపాలిటీల్లోనే సగానికి పైగా 1,19,668 మంది ఓటర్లున్నారు. దీంతో ఈ రెండు మున్సిపాలిటీల్లో చైర్మన్లుగా తమవారే ఉండాలని జగ్గారెడ్డి, చింతా ప్రభాకర్ పట్టుమీదున్నారు.
పట్టుకోసం పాట్లు…
రెండు దశబ్ధాలుగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి వర్సస్ చింతా ప్రభాకర్ మధ్యనే పోటీ నడుస్తోంది. 2023 ఎన్నికల్లో జగ్గారెడ్డిపై చింతా ప్రభాకర్ విజయం సాధించాడు. ఎన్నికల్లో పోటి చేసిన వారికి నామినేటెడ్, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వొద్దని కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడంతో సంగారెడ్డిలో రాజకీయంగా జగ్గారెడ్డికి పదవి లేకుండా పోయింది. కానీ జగ్గారెడ్డి భార్య నిర్మలకు టీజిఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ప్రసుత్తం సంగారెడ్డిలో ఏ కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యేతో పాటు నిర్మల జగ్గారెడ్డి పాల్గొంటున్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బిఅర్ఎస్ మధ్య గట్టి పోటీ నడించింది. రెండు పార్టీలకు బలమైన సీట్లు వచ్చాయి. జగ్గారెడ్డి సంగారెడ్డి మున్సిపాలిటీకి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సదాశివపేట మున్సిపాలిటీకి చెందినవారు. ఈ రెండు మున్సిపాలిటీల పరిధిలోనే నియోజకవర్గానికి చెందిన సగానికి పైగా మంది ఓటర్లు ఉండటంతో.. తమ పట్టును పెంచుకోడానికి వీరిద్దరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని …అభివ్రద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇవ్వాలని, ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకువస్తామని జగ్గారెడ్డి చెబుతున్నారు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటు చింతా ప్రభాకర్ కూడా వరుస మీటింగులు పెడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హమీలను నెరవేర్చలేదని.. బీఅర్ఎస్ ప్రభుత్వ హయంలోనే సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు భారీగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశామని చెబుతున్నారు. వచ్చేది బీఅర్ఎస్ ప్రభుత్వమేనని.. అభివృద్ధి చేసే బాధ్యత తనది అంటున్నారు. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. మరి ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.


