కలం, ఖమ్మం బ్యూరో : జనవరి, 2027 నాటికి మున్నేరు-పాలేరు లింక్ కాలువ ప్రాజెక్టును పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించి మూడు జిల్లాలకు ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్త ఆయకట్టుకు నీరు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని మద్దులపల్లి గ్రామంలో 162.54 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మున్నేరు-పాలేరు లింక్ కాలువ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రయోజనం పొందేలా రూపొందించిన ఈ ప్రాజెక్టు ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు వరప్రదాయనిగా మారనుందని అన్నారు.
వరదలు సంభవిస్తున్న సమయంలో వృధాగా సముద్రంలో కలుస్తున్న అదనపు నీటిని 9.6 కిలోమీటర్ల పొడవైన లింక్ కాలువ ద్వారా నేరుగా వరద రూపంలో పాలేరు రిజర్వాయర్‌కు మళ్లించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. అటువంటి ఈ ప్రాజెక్టును నిర్ణిత గడువు (జనవరి,2027) నాటికి పూర్తి చేసేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామని అన్నారు. 167 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు బహుళ ప్రయోజనాలతో కూడుకుందని తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగిలే దీనిని రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు.


